ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్‌

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే వ్యాక్పినేషన్‌లో రాజస్థాన్‌లోని బికనేర్‌ నగరం మరో అడుగు ముందుకేసింది.

Published : 13 Jun 2021 01:07 IST

ప్రారంభించిన తొలి నగరంగా బికనేర్‌

జైపుర్‌: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే వ్యాక్పినేషన్‌లో రాజస్థాన్‌లోని బికనేర్‌ నగరం మరో అడుగు ముందుకేసింది. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమం కోసం రెండు అంబులెన్సులు, మూడు ప్రత్యేక బృందాలను జిల్లా పాలనా యంత్రాంగం సిద్ధం చేసింది. వ్యాక్సిన్‌ అవసరమైనవారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ నెంబరుతో పాటు.. సందేహాల నివృత్తి కోసం ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఇంటి వద్దకే వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలి నగరంగా బికనేర్‌ నిలవనుంది.

వ్యాక్సిన్‌ కోసం కనీసం 10 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే అంబులెన్సులు వారి ఇళ్లకు బయలుదేరతాయి. ఒక వయల్‌ 10 మందికి ఇచ్చే వీలున్నందున.. టీకా వృథా కాకుండా ఉండేందుకు ఈ నిబంధన పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టీకా వేసిన తర్వాత వారిని పర్యవేక్షించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడే కొంతసేపు ఉంటారని తెలిపారు. బికనేర్‌లో 16 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. టీకా ఇచ్చిన వ్యక్తుల వివరాలను వారికి సమీపంలోని కేంద్రాలకు ఇస్తారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే వీలు అక్కడి వైద్యులకు కలుగుతుందని అధికారులు తెలిపారు.

7 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరంలో ఇప్పటికే 60-65 శాతం ప్రజలకు టీకాలు ఇచ్చినట్టు బికనేర్‌ కలెక్టర్‌ నమిత్‌ మెహతా తెలిపారు. మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనీసం 75 శాతం  మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఆ వయసు వారు వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వివరించారు. బికనేర్‌లో ఇప్పటివరకు 3,69,000 మందికి పైగా టీకా తీసుకున్నారు. శనివారం నగరంలో కొత్తగా 28 కరోనా కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం 453 క్రియాశీల కేసులున్నాయి. రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 368 కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని