బయోమార్కర్ల సాయంతో వైరస్‌ తీవ్రత అంచనా!

సాంకేతిక పద్ధతులనుపయోగించి ప్రమాద తీవ్రతను ముందుగానే అంచనా వేసే బయోమార్కర్లను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా కొవిడ్‌ను నిర్ధారించడంతోపాటు వాటి తీవ్రతను ముందుగానే విశ్లేషించవచ్చని పేర్కొంటున్నారు.

Published : 12 Feb 2021 01:12 IST

కృత్రిమ మేధ సాయంతో గుర్తింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, వైరస్‌ సోకిన వారిలో కొందరు స్వల్ప లక్షణాలతో బయటపడుతుండగా, మరికొందరిలో మాత్రం శ్వాసకోశ వ్యవస్థలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పద్ధతులనుపయోగించి ప్రమాద తీవ్రతను ముందుగానే అంచనా వేసే బయోమార్కర్లను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా కొవిడ్‌ను నిర్ధారించడంతోపాటు వాటి తీవ్రతను ముందుగానే విశ్లేషించవచ్చని పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ సోకిన వారికి ఇంతకుముందు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారికి ఆసుపత్రిలో చేరే ముప్పు ఎక్కువేనని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మరికొంత మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా తీవ్రస్థాయిలో లక్షణాలు బయటపడుతున్నాయి. ఇటువంటి సమయంలో వారి ఆరోగ్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి మెరుగైన వైద్యం అందించడమే ఎంతో కీలకం. దీనిలో భాగంగా మాస్‌ స్పెక్ట్రోమెట్రీతో పాటు కృత్రిమ మేధస్సును వినియోగించేందుకు ఆండెర్‌సన్‌ రోసా, రోడ్రిగో రామోస్‌ క్యాథరినో అను ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

ఇందుకోసం వివిధ తీవ్రత కలిగిన 442 మంది కరోనా రోగులను, మరో 350 మంది నెగటివ్‌ వచ్చిన వారిని పరిగణలోకి తీసుకున్నారు. వారితోపాటు ఆర్‌టీపీసీఆర్‌లో నెగిటివ్‌ వచ్చినప్పటికీ, వైరస్‌ సోకినట్లు భావిస్తోన్న మరో 23మందిపైనా పరిశోధన జరిపారు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మాను స్పెక్ట్రోమెట్రీ, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికల సాయంతో విశ్లేషించారు. తద్వారా 19మందిలో వైరస్‌ పసిగట్టే బయోమార్కర్లను గుర్తించారు. స్వల్ప, తీవ్ర కేసుల మధ్య తేడాలను గుర్తించే మరో 26బయోమార్కర్లను కూడా శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా అనుమానిత కేసుల్లో దాదాపు 78శాతం పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని, అయితే, ఆర్‌టీపీసీఆర్‌లో తప్పుడు ఫలితం కారణంగానే ఇది సాధ్యమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పరిశోధనలో భాగంగా ఇన్‌ఫ్లమేషన్‌, లిపిడ్ పునర్నిర్మాణం మరియు కొలెస్ట్రాల్ హోమియోస్టాసిస్‌ వంటి బయోమార్కర్లను గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, తమ అంచనాలను మరోసారి ధ్రువీకరించుకోవాల్సి ఉందన్న శాస్త్రవేత్తలు, కరోనా వైరస్‌ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని తెలియజేయడంతో పాటు మరిన్ని ఆధారాలను ఇవి వెల్లడిస్తాయని అంటున్నారు.

ఇవీ చదవండి..
ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఏ గేమ్‌ ఛేంజర్‌!
అతడికి కరోనా గురించి తెలియదు

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts