Baal Aadhaar: చిన్నారుల ఆధార్‌.. బయోమెట్రిక్‌ అప్‌డేట్ చేశారా? 

ప్రస్తుతం దేశంలో ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారుల కోసం ..

Published : 26 Jul 2021 01:57 IST

దిల్లీ: ప్రస్తుతం దేశంలో ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరి ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారుల కోసం నీలి రంగుల్లో బాల్ ఆధార్‌ కార్డ్ తీసుకొచ్చింది. తాజాగా బాల్‌ ఆధార్‌ కార్డ్ ఉండి ఐదేళ్ల వయసున్న చిన్నారుల తల్లిదండ్రులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకోసం తల్లిదండ్రులు చిన్నారులను తమ దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించింది. దీని గురించి తల్లిదండ్రులకు మరోసారి గుర్తుచేస్తున్నట్లు యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది. 

‘‘ఐదేళ్లు నిండిన చిన్నారుల అందరికీ నీలి రంగు ఆధార్‌ కార్డ్ జారీ చేస్తారు. ఇప్పటికే ఈ ఆధార్‌ కార్డ్ తీసుకుని ఐదేళ్లు వచ్చిన చిన్నారులకు బయోమెట్రిక్‌ అప్‌డేట్ చేయాలి. దీనికోసం ఐదేళ్ల వయసున్న చిన్నారుల తల్లిదండ్రులు వారిని దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లాలి. దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రం కోసం కింద ఉన్న లింక్‌ క్లిక్ చేయండి లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయండి’’ అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసుకున్న చిన్నారులు ఐదేళ్లు వచ్చినట్లుగా గుర్తిస్తారు. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత మై ఆధార్‌పై క్లిక్ చేస్తే లొకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రాష్ట్రం, పోస్టల్‌ కోడ్, సెర్చ్ బాక్స్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఏదో ఒక ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే మీ దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రం చిరునామా చూపిస్తుంది. అక్కడికి వెళ్లి చిన్నారుల బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని