బతికిస్తామంటూ శవానికి క్షుద్రపూజలు

మరణించిన వ్యక్తిని బతికించడం వైద్యశాస్త్రానికే సాధ్యంకాని పని. అలాంటిది మారుమూల గ్రామంలోని మోసగాళ్లు కొందరు మృతిచెందిన వ్యక్తిని బతికిస్తామంటూ కుటుంబసభ్యులను నమ్మించారు. పెద్దగా నాగరికత తెలియని మృతుడి కుటుంబీకులు చనిపోయిన వారి ఇంటిపెద్దను బతికిస్తామంటే గుడ్డిగా....

Published : 08 Apr 2021 01:13 IST

ఒడిశాలోని గిరిజన గ్రామంలో ఘటన

నయాగఢ్‌: దేశంలో అక్కడక్కడా ఇంకా మూఢనమ్మకాల వాసన గుప్పుమంటూనే ఉంది. వైద్య శాస్త్రానికే సాధ్యంకాని పనులను సైతం తాము చేస్తామంటూ కొందరు కేటుగాళ్లు బయలుదేరి, అమాయకులను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు.  ఇంతవరకూ మంత్రాలు, తాయత్తులతో జబ్బులు నయం చేస్తామని చెప్పేవాళ్లనే మనం చూసివుంటాం. కానీ ఒడిశాలో ఏకంగా చనిపోయిన మనిషినే బతికిస్తామంటూ నమ్మబలికి ఓ గూడెంలో ఉన్నవాళ్లందరినీ బురిడీ కొట్టించిన సంఘటన జరిగింది.  ఇటీవల నయాగఢ్‌ జిల్లాలోని బార్సాహీ అనే కుగ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శవానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబసభ్యులు మోసగాళ్ల మాటలు విని క్షుద్రపూజలకు అనుమతించారు. 

 పెద్దగా నాగరికత తెలియని మృతుడి కుటుంబీకులు చనిపోయిన తమ ఇంటిపెద్దను బతికిస్తామంటే గుడ్డిగా నమ్మేశారు. గిరిజన గూడెం ప్రజల సమక్షంలోనే శవానికి క్షుద్రపూజలు నిర్వహించారు. 

మృతదేహాన్ని ఇంటి బయట నేలపై ఉంచిన మాయగాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్నీ చేశారు. శవంపై సలసల కాగే నీటిని కుండలకొద్దీ పోశారు. ఆ తర్వాత గుండెను బలంగా నొక్కారు. ఇలా అనేక ఫీట్లు చేశారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతుకుతాడో అనే చోద్యాన్ని గూడెం ప్రజలంతా గుడ్లప్పగించి చూశారు. గంటలు గడుస్తున్నా శవంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని