Hyderabad: గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి

గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు.

Published : 07 Jul 2024 12:02 IST

హైదరాబాద్‌: గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈ సారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు, ఆదివారాల్లో  బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు... 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. 

నేడు తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి... చోటాబజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం  బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు ఎక్కిస్తారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల  21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని