Bopparaju: మా జీపీఎఫ్ సంగతేంటి? దాచుకోవడమే నేరమా?: బొప్పరాజు

ఉద్యోగులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 

Updated : 06 Mar 2023 13:44 IST

విశాఖ: ఉద్యోగులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గత నాలుగేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. 

‘‘ఉద్యోగ వర్గాన్ని జగన్‌ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలి. చట్టబద్ధంగా రావాల్సినవి.. మేం దాచుకున్న డబ్బులూ ఇవ్వడం లేదు. 11వ పీఆర్సీ ప్రకటించినా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో.. ఎంత వస్తుందో తెలియడం లేదు. డీఏ బకాయిలు లక్షలాది రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదు. పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు చెల్లించడం లేదు. ఏడాదిగా పోలీసుల సరెండర్‌ లీవ్స్‌కి చెల్లింపులు చేయడం లేదు.

వారంలో సీపీఎస్‌ రద్దు అన్నారు.. ఏమైంది?

మేం దాచుకున్న జీపీఎఫ్‌ సంగతేంటి? అలా దాచుకోవడమే నేరమా? జీపీఎఫ్‌ మొత్తం రూ.3వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు.. అవి ఏమయ్యాయి? సీపీఎస్‌ ఉద్యోగుల వాటా రూ.1200 కోట్లు ఏమయ్యాయి? ఈ అన్యాయాలు ప్రజలందరికీ తెలియాలి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు అన్నారు.. ఏమైంది? ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్‌ రద్దు చేస్తే.. వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మీరేం చేశారు? రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో పాతపెన్షన్‌ విధానం అమలును సమీక్షించేందుకు తీసుకెళ్లి మళ్లీ ఎందుకు మాట మారుస్తున్నారు?సీపీఎస్‌ దుర్మార్గమని, అన్యాయమని మీరే చెప్పినా దాన్ని రద్దు చేయడానికి ఆలస్యమెందుకు? జీపీఎస్‌ విధానాన్ని మేం పూర్తిగా తోసిపుచ్చాం. చర్చలకు కూడా రావట్లేదని చెప్పాం.

ఆ విధానాన్ని మీరు రద్దు చేసుకోగలరా?

రాజకీయ నేతలు ఎందుకు పెన్షన్‌ తీసుకుంటున్నారు? ఆ విధానాన్ని మీరు రద్దు చేసుకోగలరా? వయసు అయిపోయే వరకూ మీరేమైనా సేవ చేస్తున్నారా? రాజకీయ నేతల రాయితీలు ప్రపంచంలో ఎవరూ పొందరు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 22 ఏళ్లుగా సర్వీసులో ఉన్నారు. క్రమబద్ధీకరణ చేస్తామని వారిని నమ్మించారు.. అందుకే ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ప్రతి ఉద్యోగీ ఎల్లుండి నుంచి ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఏపీ ఎన్జీవో జేసీ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి’’ అని బొప్పరాజు కోరారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని