ఆ లాయర్‌ ఎత్తు ఎంతంటే..?

సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్​కు చెందిన హర్విందర్​కౌర్​ అలియాస్‌ రూబి (24). మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె....

Updated : 11 Jul 2021 03:35 IST

జలంధర్‌: సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు పంజాబ్​కు చెందిన హర్విందర్​కౌర్​ అలియాస్‌ రూబీ (24). మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఆమె.. లాయర్​ కొలువు సాధించి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగుల కోసం కోర్టులో ఉచితంగా వాదనలు వినిపిస్తానని పేర్కొంటున్నారు. తోటివారు హేళన చేస్తున్నారని స్కూల్ మానేసిన రూబీ.. లాయర్​గా ఎలా మారారో తెలిస్తే ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు.

జలంధర్​ రామ మండిలోని అర్మాన్‌నగర్​లో నివసించే రూబీ జీవితం పదేళ్ల వరకు సాఫీగానే సాగింది. తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకునేది. అయితే వయసు పెరుగుతున్నా ఆమె ఎత్తు అంతగా పెరగలేదు. దీంతో తాను ఇతరుల్లా కాదని రూబీకి తన పదో ఏటనే అర్థమైంది. ఇతరులు తనను చిన్నచూపు చూడటం, గేలి చేయడం భరించలేకపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లడం తగ్గించేసింది. ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేది. ఇంట్లోనే చదువుకుంటూ 10వ తరగతి, ఇంటర్‌ పాసయ్యింది. తన శక్తిసామర్థ్యాలపై తనకే విశ్వాసం సన్నగిల్లితున్న తరుణంలో ఆత్మవిశ్మాసాన్ని పెంపొందించుకుంది. ఏదైనా సాధించాలని నిశ్చయించుకొంది. డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకొని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లేది.

తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నానని, కానీ అది సాధ్యం కాదని తెలిసి లాయర్​ అవ్వాలనుకున్నట్లు రూబీ పేర్కొన్నారు. తమ ఇంట్లో అందరూ సాధారణ ఎత్తే ఉంటారని తెలిపారు. కేవలం లా పూర్తి చేయడమే కాకుండా, అందరి మనసులు గెలుచుకోవాలని తాను అనుకున్నట్లు వివరించారు. లాయర్​ అయ్యాక అందరూ తనను గౌరవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగ్​పాల్ సింగ్​ వద్ద లా ప్రాక్టీస్​ చేస్తున్నారు. దివ్యాంగుల తరఫున కోర్టులో ఉచితంగా వాదిస్తానని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు