Goa: వెళ్లాలంటే.. రెండు డోసులు పడాల్సిందే..!

కరోనా కేసుల్లో తగ్గుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచాయి. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన యాత్రికులు

Published : 29 Jun 2021 01:36 IST

పానాజి: కరోనా కేసుల్లో తగ్గుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచాయి. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన యాత్రికులు ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటక ప్రదేశాలకు పోటెత్తుతున్నారు. అయితే గోవా వెళ్లాలంటే మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని అక్కడి సర్కారు చెబుతోంది. కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామంటోంది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సోమవారం కీలక ప్రకటన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు గోవా సందర్శించేందుకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని చూపించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేవలం టీకా తీసుకున్న ధ్రువపత్రాన్ని చూపిస్తే సరిపోతుందన్నారు. పర్యాటకులకు మాత్రమే కాకుండా వ్యాపార, ఇతర కార్యకలాపాల కోసం రాష్ట్రానికి వచ్చేవారికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. 

గోవాలో కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి తగ్గిపోయిందని.. రానున్న కొద్ది రోజుల్లో ఇది 5 శాతానికి తగ్గుతుందని ప్రమోద్‌ సావంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రికవరీ రేటు సైతం గణనీయంగా పెరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయివేటు ప్రయోగశాలల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. జులై 30 నాటికి రాష్ట్రంలో 100 శాతం ప్రజలకు మొదటి డోసు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు.    

  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని