
Turkey: అధ్యక్షుడు చేయాల్సిన రిబ్బన్ కటింగ్.. ఓ బుడ్డోడు ఏం చేశాడంటే..?
ఇంటర్నెట్ డెస్క్: టర్కీలో ఓ బుడ్డోడు చేసిన పనికి అందరూ అవాక్కవుతున్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్.. హైవే టన్నెల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ వేడుకకు వచ్చిన ఓ బాలుడు ఎర్డోగాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే అసహనానికి గురయ్యాడు. దీంతో అతని చేతిలో ఉన్న కత్తెరతో రిబ్బన్ కట్ చేసి టన్నెల్‌ను ప్రారంభించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో కొంతమంది పిల్లలు వేదికపై అధ్యక్షుడి ముందు వరుసలో నిలుచున్నారు. ఒక వైపు కార్యక్రమ ప్రారంభం గురించి మాట్లాడుతుండగానే ఓ బాలుడు రిబ్బన్‌ను కత్తిరించాడు. తర్వాత దాన్ని పట్టుకునే ఉంటాడు. తన తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. అది గుర్తించిన అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆ పిల్లోడి తలపై చేయి వేసి.. అతనితో మాట్లాడాడు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలతో ముచ్చటిస్తూ సరదాగా హై ఫై ఇస్తాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘బుడ్డోడి చిన్న చేతులతో హైవే టన్నెల్ ప్రారంభమయ్యింది. భవిష్యత్తులో అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ఒకరు రాసుకొచ్చారు.
కాగా.. దీనిపై మరొక ట్విటర్ యూజర్ స్పందిస్తూ..‘‘ఈ పిల్లాడు ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే, అది ఒక్క అధ్యక్షుడు మాత్రమే కట్ చేయాల్సింది కాదు. పిల్లలతో కూడా రిబ్బన్ కట్ చేయించాల్సి ఉంది. వారిలో చాలామంది చేతుల్లో కత్తెర ఉంది. కానీ, ఆ బాలుడు తొందరపడి అందరికంటే ముందు రిబ్బన్‌ను కత్తిరించాడు’’ అని పేర్కొన్నారు.