బాలుడికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.16 కోట్లు

బుడిబుడి నడకలతో అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన ఆ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పుట్టినప్పటినుంచే కండరాల వ్యాధితో తల్లడిల్లుతున్నాడు. ఆ మహమ్మారి నయం కావాలంటే అక్షరాలా రూ.16 కోట్లు కావాల్సిందేనని వైద్యులు....

Published : 15 Feb 2021 16:38 IST

సాయమందించాలని అర్థిస్తున్న తల్లిదండ్రులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముద్దుమాటలతో అలరించాల్సిన ఓ బాలుడు అరుదైన ఆరోగ్యసమస్యతో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచే కండరాల సమస్యతో తల్లడిల్లుతున్నాడు. అది నయం కావాలంటే అక్షరాలా రూ.16 కోట్లు కావాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. ఇంపాక్ట్‌ గురూ.కామ్‌ ద్వారా కుటుంబసభ్యులు డబ్బుల కోసం అర్థిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన యోగేశ్‌ గుప్తా, రూపాల్‌ గుప్తా పదేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. లింగంపల్లిలోని నలగండ్లలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 2018లో అయాంక్ష్‌ జన్మించాడు. పుట్టినప్పటి నుంచే బాలుడి ఆరోగ్యం సరిగా లేదు. దీంతో సికింద్రాబాద్‌లోని ఓ పిల్లల వైద్యశాలకు తీసుకెళ్లగా కుమారుడి వ్యాధి, అందుకయ్యే ఖర్చు తెలిసి తల్లిదండ్రులు కుంగిపోయారు. అయాంక్ష్‌  వెన్నెముఖ కండరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రపంచంలో దానికి ఏకైక చికిత్స జీన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ జోల్గన్‌ ఎస్‌ఎమ్‌ఏ ఔషధంతోనే సాధ్యమని పేర్కొన్నారు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఇంజెక్షన్‌ ధర రూ.16 కోట్లు ఉంటుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంతపనైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.   

అంతమొత్తం డబ్బు ఏ ఒక్కరు సాయం చేయలేరని.. పెద్దఎత్తున క్రౌడ్‌ ఫండింగ్‌ మొదలుపెట్టారు. ఖరీదైన చికిత్స కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేసే ఇంపాక్ట్ గురూ.కామ్‌లో యోగేశ్‌ గుప్తా ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించారు. కాగా, పది రోజుల్లో రూ.1.40 కోట్లు జమయ్యాయి. ఉద్యోగం చేస్తూనే.. సామాజిక మాధ్యమాలు, ఇతర సైట్ల సాయంతో నిధులు సమకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తమ కుమారుడి చికిత్స కోసం ప్రజలు ముందుకువచ్చి సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.

తన కుమారుడికి ఈ వ్యాధి రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అయాంక్ష్‌ తల్లి రూపాల్‌ గుప్తా తెలిపారు. కుమారుడికి నిత్యం ఐదు గంటలపాటు ఫిజియోథెరఫీ చేయిస్తున్నామని, ఒక్కరోజు చేయించకున్నా ప్రమాదమని వాపోయారు. అయాంక్ష్‌ జన్మించినప్పటి నుంచి ద్రవరూప ఆహారమే తప్ప, ఘనరూపంలో ఆహారం తినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. రూ.16 కోట్ల భారీ మొత్తం త్వరగా సమకూరాలని అయాంక్ష్‌ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు మినహాయించి తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చదవండి...

కేకుతో రామసేతు.. రామమందిరానికి విరాళం

నిన్ను, పిల్లల్ని చూడాలని ఉంది వస్తా..
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని