Health: దోమకాటు.. మెదడు వాపు

మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా శరీర స్పందనల్లో మార్పులు మొదలవుతాయి. మెదడు సంక్లిష్టమైన నిర్మాణం..చాలా భద్రమైన రక్షణ వలయంలో బలమైన ఎముకల పుర్రెతో కప్పి ఉంటుంది.

Published : 22 Apr 2022 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా శరీర స్పందనల్లో మార్పులు మొదలవుతాయి. మెదడు సంక్లిష్టమైన నిర్మాణం. చాలా భద్రమైన రక్షణ వలయంలో బలమైన ఎముకల పుర్రెతో కప్పి ఉంటుంది. ఇది చిన్న దోమతో ఇబ్బంది పడుతుంది. మెదడు వాపుతో పెద్ద చిక్కులే ఎదురవుతాయి. జపనీస్‌ ఎనసెఫలైటీస్‌ వైరస్‌తో వచ్చే వాపును సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని నివారణ, జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్‌ నవీన్‌ తోట వివరించారు.

మెదడువాపు ఎలా వస్తుంది: మెదడు చుట్టూ మూడు పొరలుంటాయి. ఇందులో దేనికైనా ఇన్‌ఫెక్షన్లు వస్తే మెదడువాపు వస్తుంది. దోమకాటుతో పాటు వైరస్‌, బ్యాక్టీరియా, టీబీ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లతో రావచ్చు. రోగ నిరోధక శక్తి లేకపోవడంతో పాటు కొన్నిసార్లు క్యాన్సర్‌ సోకినా మెదడువాపు వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు ఇవీ: మెదడు వాపు సూచనల్లో జ్వరం రావడం, తలనొప్పి, మెడ బిగుతుగా ఉండటంతో పాటు మగతగా ఉంటుంది. ఫిట్స్‌ వస్తాయి. కాళ్లు, చేతులు బలహీనంగా మారుతాయి. 

నిర్దారణ ఎలా: మెదడు స్కాన్‌ చేయించాల్సి ఉంటుంది. వెన్నులో నుంచి నీరు (లంబార్‌ పంక్చర్‌) తీస్తారు. వైరస్‌, బ్యాక్టీరియా, టీబీ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏమైనా ఉందా అని తెలుసుకుంటారు. మెదడువాపు వచ్చిన వారికి గుండె సంబంధిత పరీక్షలు, బ్లడ్‌ కల్చర్‌ కూడా చేయాల్సి వస్తుంది.

చికిత్స ఎలా ఉంటుంది: బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ అయితే 12 రోజుల పాటు యాంటీబయోటిక్స్‌ సరిపోతాయి. ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే 21 రోజులు వాడాల్సి వస్తుంది. టీబీ ఇన్‌ఫెక్షన్‌ అయితే 12-18 నెలల పాటు మందులు వాడాలి. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ అయితే 21 రోజులు, వైరల్‌ అయితే 14 రోజులు మందులు వాడితే చాలు. ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే వైద్యం చేయించుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రస్థాయికి చేరుకుంటుంది.

జాగ్రత్త అవసరం: మెదడు వాపు ప్రాణాంతకంగా మారకముందే చికిత్స చేసుకుంటే బాగవుతుంది. కానీ అంతకంటే ముందు దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా చేసుకోవాలి. పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని