Tomatoes From Single Stem: ఒక్క కాండానికి 839 టొమాటోలు!

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి సాగులో విశేష కృషి చేశారు. టొమాటో మొక్కలోని ఒక్క కాండానికే 839 టొమాటోలు పండించారు.....

Updated : 21 Sep 2021 05:05 IST

స్టాన్‌స్టీడ్‌ అబోట్స్‌: ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి సాగులో విశేష కృషి చేశారు. టొమాటో మొక్కలోని ఒక్క కాండానికే 839 టొమాటోలు పండించారు. స్టాన్‌స్టీడ్‌ అబోట్స్‌ ప్రాంతానికి చెందిన డగ్లస్‌ స్మిత్‌ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో పనిచేస్తూనే.. అధునాతన పద్ధతిలో పలు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. గతంలో ప్రపంచంలోనే పెద్దదైన టొమాటోను పండించి రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే మరో రికార్డు నెలకొల్పేందుకు నడుంబిగించారు. మొక్కలోని ఒక్క కాండానికి అత్యధిక టొమాటోలు పండించాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం ఈ ఏడాది మార్చి నుంచి కృషి చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజు 3-4 గంటలు కష్టపడ్డారు.

స్మిత్‌ కృషికి తాజాగా ఫలితం దక్కింది. ఆయన పండించిన టొమాటో మొక్కలోని ఒక్క కాండానినే 839 కాయలు కాశాయి. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు స్మిత్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అధికారులు త్వరలోనే వ్యవసాయ క్షేత్రానికి వచ్చి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క కాండానికి అత్యధికంగా 448 టొమాటోలు పండించి గ్రహమ్‌ టాంటెర్‌ అనే వ్యక్తి గతంలో గిన్నిస్‌ రికార్డు సాధించారు. కాగా ప్రస్తుతం డగ్లస్‌ స్మిత్‌ ఆ రికార్డును బద్దలు కొట్టారు. స్మిత్‌ గతేడాది ప్రపంచంలోనే అతిపెద్ద టొమాటోను పండించి వార్తల్లో నిలిచారు. దాని బరువు 6.85 పౌండ్లు అంటే 3.1కిలోలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని