Raksha Bandhan: నిజమైన రక్షాబంధనం.. అక్కకి తమ్ముడి కిడ్నీ దానం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. కష్టసుఖాల్లో ఎప్పుడూ రక్షగా ఉంటాడని సోదరుడికి సోదరి రాఖీ కడుతుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రాణాపాయ

Published : 21 Aug 2021 16:41 IST

దిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. కష్టసుఖాల్లో ఎప్పుడూ రక్షగా ఉంటాడని సోదరుడికి సోదరి రాఖీ కడుతుంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అక్కను రక్షించుకున్నాడో సోదరుడు. ఆమెకు కిడ్నీ దానం చేసి పునర్జన్మనిచ్చాడు. 

హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన 31ఏళ్ల మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతోంది. ఆమెకు అధిక రక్తపోటు కూడా ఉంది. అయితే తొలినాళ్లలో ఈ విషయం గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి కిడ్నీలు పాడయ్యాయి. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు హైబీపీ కారణంగా ఆమె గుండె బలహీనంగా మారింది. ఇతర అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. 

మహిళకు కిడ్నీ దానం చేసేందుకు ఆమె భర్త ముందుకొచ్చారు. అయితే బ్లడ్‌గ్రూప్‌ సరిపోలేదు. ఆ తర్వాత ఆమె తమ్ముడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరిదీ ఒకే గ్రూప్‌ అని తెలిసింది. దీంతో వెంటనే ఆపరేషన్‌ చేసిన వైద్యులు అతడి కిడ్నీని మహిళకు అమర్చారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా మహిళ తమ్ముడు మాట్లాడుతూ.. ‘‘కిడ్నీ సమస్య కారణంగా మా అక్క నరకయాతన అనుభవించింది. ఆమెకు నా కిడ్నీ సరిపోతుందని వైద్యులు చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా జీవితంలో ఆమె నాకు ఎంతో విలువైనది. ఇక నుంచి మా అక్క సంతోషంగా జీవిస్తుందని ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని