Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు

ప్రకాశం జిల్లాలో గంటల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

Published : 06 Feb 2023 22:27 IST

పెద్దారవీడు: ఒకే కడుపున పుట్టిన ఆ అన్నదమ్ములు ఇద్దరూ గంట వ్యవధిలో మృతి చెందారు. స్నేహితుల్లా అన్యోన్యంగా ఉండే ఆ ఇద్దరి బంధం గంటల వ్యవధిలోనే గాల్లో కలిసిపోయింది. మొదట తమ్ముడు గుండెపోటు (Heart attack)కు గురయ్యారు. ఆయన ఆకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన అన్న.. గుండెలవిసేలా రోదించి కుప్పకూలిపోయాడు. అతడికి కూడా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికుల హృదయాలను కలిచివేసింది. కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటూ భరోసా ఇచ్చుకునే వారని గ్రామస్థులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని బద్వీడు చెర్లోపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.

మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్ద అల్లూరిరెడ్డి (67), చిన్న అల్లూరిరెడ్డి(65) అన్నదమ్ములు. సోమవారం తెల్లవారుజామున చిన్న అల్లూరిరెడ్డికి గుండె పోటు రావడంతో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని వివరించారు. తమ్ముడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తున్నారని తెలుసుకున్న సోదరుడు పెద్ద అల్లూరిరెడ్డి ఆవేదనకు గురయ్యారు. గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబాల్లో, గ్రామంలో విషాద ఛాయాలు అలముకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని