Budget Special @ 5 PM: కేంద్ర బడ్జెట్‌ 2022 రౌండప్‌

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలు మీ కోసం.. 

Updated : 01 Feb 2022 17:20 IST

1. బ‌డ్జెట్ ముఖ్య విష‌యాలు

2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భార‌త్ 75 ఏళ్ల అమృత మ‌హోత్స‌హాన్ని జ‌రుపు కుంటుంద‌ని, వ‌చ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బ‌డ్జెట్ పునాద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో తెలిపారు. అలాగే ముఖ్యంగా నాలుగు అంశాల‌పై.. ప్ర‌ధాని గ‌తిశ‌క్తి యోజ‌న‌,  సమీకృత అభివృద్ధి,  అభివృద్ధి ఆదారిత పెట్టుబ‌డులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం లక్ష్యంగా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు తెలిపారు. 

2. వేతన జీవులకు మరోసారి నిరాశ

ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు మరోసారి నిరాశ ఎదురైంది. పన్ను మినహాయింపుపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్‌లపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో వివరాలు వెల్లడించలేదు. దీంతో వేతన జీవులు బడ్జెట్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

3. గతి ‘మార్చే’ శక్తి: 3 ఏళ్లలో 400 వందేభారత్‌ రైళ్లు

మౌలిక వసతుల సదుపాయాల రంగంలో ముఖ్యమైన రైల్వేల్లో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల కంటే వేగంతో దూసుకెళ్లే వందే భారత్‌ రైళ్లను మరిన్ని తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే 100 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం కాగా.. రాబోయే మూడేళ్లలో మరో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

4. విద్యార్థుల కోసం.. ‘వన్‌ క్లాస్ - వన్‌ టీవీ’

బడ్జెట్‌లో విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘ప్రధాని ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని మరింత విస్తరించనున్నాం. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్‌ ఛానళ్లు ఉండగా.. వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నాం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనున్నాం’ అని పేర్కొన్నారు. 

5. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు

రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశం సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ.. దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం రూపొందించినట్లు చెప్పారు. 

6. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను..!

క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను విధించనున్నట్లు నిర్మల ప్రకటించారు. ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు మాత్రం ఉండదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

7. త్వరలో అంతే.. కచ్చితంగా తేలని ఎల్‌ఐసీ ఐపీవో తేదీ..!

ఎల్‌ఐసీ ఐపీవోపై కేంద్రం కచ్చితమైన సమయాన్ని వెల్లడించకుండా గందరగోళాన్ని కొనసాగించింది.  కానీ, బడ్జెట్‌ ప్రతుల్లో 2022 పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలను సవరించింది. వీటిని పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఒక పెద్ద ఐపీవో వంటిది ఉండవచ్చని అర్థమవుతోంది. ఆస్తుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఈ సారి కొంత వెనుకడుగు వేసింది. 2022-23 సంవత్సరానికి రూ.65 వేల కోట్లకు మాత్రమే ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. 

8. వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊరట..!

కేంద్ర బడ్జెట్‌ వేళ.. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. చమురు సంస్థలు 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.91.5 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటి ధరలు మంగళవారం(ఫిబ్రవరి ఒకటి) నుంచి అమల్లోకి రానున్నాయి. దాంతో ఈ సిలిండర్ ధర దిల్లీలో రూ.1,907 గా ఉండనుంది.

9. హైటెక్‌ వ్యవసాయం.. బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రోత్సాహం

ప్రపంచంలోని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అతి పెద్దది. అత్యధికమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయరంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. వరి- గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

10. డిజిటల్‌ భారత్‌కు ‘బడ్జెట్‌’ రైట్‌ రైట్‌..!

దేశాన్ని ‘డిజిటల్‌ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు ఈసారి బడ్జెట్‌ (Union Budget 2022)లో సాంకేతికతపై ప్రత్యేక దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా డిజిటల్‌ కరెన్సీని తీసుకురానుంది. ఈ ఏడాదిలోనే డిజిటల్‌ రూపీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ 2022-23 ప్రసంగంలో ప్రకటించారు. ఇక దీంతో పాటు 5జీ టెక్నాలజీని కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని