కేంద్ర బడ్జెట్‌ 2021-22 స్పెషల్‌

ముఖ్యమైన వార్తలు, విశేషాలు మీ కోసం..

Published : 01 Feb 2021 16:55 IST

1. వైద్య రంగానికి అధిక కేటాయింపులు: నిర్మల

బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గతం కంటే ఈ సారి వైద్యారోగ్య రంగంపై ఎక్కువ దృష్టి సారించామని చెప్పారు. ల్యాబ్‌లు, వైరాలజీ సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ఈ మేరకు బడ్జెట్‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వేళ వైద్య పరీక్షలకు సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డామని నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు. అందుకే ఈ సారి వైద్య రంగానికి ఈ సారి బడ్జెట్‌లో గతేడాది కంటే 37 శాతం ఎక్కువ నిధులిచ్చామని చెప్పారు. రహదారులు, వంతెనలు, విద్యుదుత్పత్తి, ఓడరేవులుపై అధికంగా ఖర్చుచేస్తామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిర్మలమ్మ సిక్సర్‌: అభివృద్ధికి ఆరు పిల్లర్లు!

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు, ఉద్యోగ కల్పన, మూలధనం, మౌలిక సదుపాలయాలపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పలువురు కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. అయితే, నిర్మలమ్మ చెప్పిన ఆరు పిల్లర్లు ఏమిటంటే..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బడ్జెట్‌ ప్రసంగంలో తిరువళ్లువర్ వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌, గురుదేవ్‌ రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళకవి తిరువళ్లువర్‌ ‘కురల్‌’ అనే గ్రంథంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ‘ రాజు లేదా పాలకుడు తన రాజ్యంలో సంపదను సృష్టించడం లేదా సమీకరిస్తుంటాడు. దీన్ని భద్రతగా కాపాడటంతో పాటు సమాజ సంక్షేమానికి వినియోగించాలి’ అన్న మాటలను ఆమె తన ప్రసంగంలో ఉటంకించారు. భారత్‌లో పన్నుల విధానం సమర్థవంతంగా ఉండటంతో పాటు పారదర్శకంగా ఉండాలన్నారు. ఇది కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనలో కీలకమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆరోగ్య’మస్తు

‘‘ఒక ప్రాంతం లేదా దేశం ఎదుర్కొనే విపత్తుల గురించి మనకు తెలుసు. కానీ కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020లో మనం ఊహించని, మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులను భరించాం. ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం’’.. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన మాటలివి. గతేడాది కాలంగా మహమ్మారిపై పోరు సాగిస్తోన్న భారత్‌.. తాజా బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రజారోగ్యం కోసం రూ. 2.23లక్షల కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లోని కేటాయింపులతో పోలిస్తే ఇది 137శాతం ఎక్కువ కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైల్వేను నిర్మలమ్మ ఇలా పట్టాలెక్కించారు..

కరోనాతో అన్ని రంగాలు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెలల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వేలను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకున్నాయి.  ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వేలకు భారీ కేటాయింపులు చేశారు. రైల్వే రంగానికి మొత్తం రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07 లక్షల కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేంద్ర బడ్జెట్‌లో టీమ్‌ఇండియా ముచ్చట

లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ జట్టును కొనియాడారు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ సాధించిన అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు. ‘క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే దేశంగా ఉన్న భారత్‌.. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాక మనం పొందిన అనుభూతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. ఆ విజయం ప్రజలకే కాకుండా ముఖ్యంగా యువతలోనూ స్ఫూర్తి నింపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని స్పష్టం చేసింది. ఓటముల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసి గెలవాలన్న దాహార్తిని, కసిని రగిలించింది’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బడ్జెట్‌ 2021: పెరగనున్న ఫోన్ల ధరలు?

నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ వివరాల ప్రకారం.. దిగుమతి చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ఛార్జర్ల ధర పెరగవచ్చని తెలుస్తోంది. ఆయా వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్‌ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్‌ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్‌ వెల్ఫేర్‌ సెస్‌ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు

2021లో జనాభా లెక్కలు  పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దాంతో చరిత్రలోనే తొలిసారిగా కాగిత రహితంగా జనగణన జరగనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేసే దిశగా..ఈ ప్రయాణం దోహదం చేస్తుందని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె వివరించారు. 2021లో నిర్వహించే జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నమోదు చేయనున్నట్లు 2019లోనే కేంద్ర మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దానికి సంబంధించిన వ్యవస్థను నిర్మించేందుకు రూ.12 వేల కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!

కేంద్రప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఆచితూచి స్పందించింది. గతేడాదితో పోలిస్తే లక్ష్యాన్ని కుదించింది. ఇప్పటికే కొంత వరకు పెట్టుబడి ఉపసంహరణ పనులు పూర్తిచేసుకొన్న సంస్థలను ఓ తీరానికి చేర్చాలని నిర్ణయించుకొంది. అంతేకాదు కీలకమైన సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు కూడా పేర్కొంది. ప్రభుత్వం సరికొత్త సెస్సులు, ఇతర ఛార్జీల జోలికి పోకుండానే కొవిడ్‌ సమయంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే పెట్టుబడుల ఉపసంహరణనే ప్రధాన మార్గంగా ఎంచుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మన బుల్‌ కుదురుకుంది.. కుమ్మేసింది..!

వారం రోజుల్లో దాదాపు రూ. 11 లక్షల కోట్ల నష్టాలు.. భల్లూక కౌగిలిలో చిక్కుకొని మార్కెట్‌ విలవిల్లాడింది. మరోపక్క బుల్‌ బడ్జెట్‌ టెన్షన్‌తో పడకేసింది. నేడు పార్లమెంట్‌లో సీతమ్మ బడ్జెట్‌ ప్రసంగం ఒక్క సారిగా బుల్‌లో జోష్‌ నింపింది. గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి చెప్పనట్లే ఈ సారి మూల ధన వ్యయాలకు నిధులను పెంచడం మార్కెట్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే  మార్కెట్‌ సూచీల్లో హెవీవెయిట్‌ షేర్లు దూసుకుపోవడానికి అవసరమైన గన్‌పౌడర్‌ లాంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని