మా వద్దే కాదు.. వాళ్ల వద్ద కూడా కొనండి: బర్గర్‌కింగ్‌

తనకు పోటీగా ఉండే సంస్థల్లో కొనుగోలు చేయమని ఏ సంస్థ కూడా చెప్పదు. పైగా పోటీ సంస్థలపై పైచేయి సాధించాలని వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, ప్రముఖ ఫుడ్‌కోర్ట్‌ సంస్థ బర్గర్‌కింగ్‌ యూకెలో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి

Published : 03 Nov 2020 22:32 IST

ప్రకటనతో నెటిజన్ల మనసు గెలిచిన ఫుడ్‌కోర్టు


(ఫొటో: బర్గర్‌కింగ్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు పోటీగా ఉండే సంస్థల్లో కొనుగోలు చేయమని ఏ సంస్థ కూడా చెప్పదు. పైగా పోటీ సంస్థలపై పైచేయి సాధించాలని వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, ప్రముఖ ఫుడ్‌కోర్ట్‌ సంస్థ బర్గర్‌కింగ్‌ యూకేలో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బర్గర్‌కింగ్‌లోనే కాదు.. మాకు పోటీగా ఉన్న అన్ని సంస్థల్లోనూ ఫుడ్‌ ఆర్డర్‌ చేయండంటూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ బర్గర్‌కింగ్‌ ఆ ప్రకటన ఎందుకు చేసిందంటే..  

యూకేలో కరోనా రెండోసారి విజృంభించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కొన్ని వారాలపాటు లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు కస్టమర్లకు అనుమతి ఇవ్వకుండా, కేవలం హోం డెలివరీ మాత్రమే చేయాలి. అయితే, ప్రజలు ఈ ఫుడ్‌కోర్టులకు ఆర్డర్లు ఇవ్వకపోతే.. వీటిలో పనిచేసే వేలమంది ఉద్యోగులు ఆదాయం కోల్పోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో బర్గర్‌కింగ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మాకు పోటీగా ఉండే మెక్‌ డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ, సబ్‌వే, డోమినొస్‌ పిజ్జా, పిజ్జాహట్‌ తదితర ఫుడ్‌కోర్టుల్లో ఆహారం ఆర్డర్‌ చేయమని మిమ్మల్ని కోరుతామని ఎప్పుడూ ఊహించలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు మీ మద్దతు కావాలి. కాబట్టి మీరు వారికి అండగా ఉండాలనుకుంటే అన్ని ఫుడ్‌కోర్టుల్లో ఆర్డర్‌ ఇచ్చి.. తెప్పించుకొని మీల్స్‌ను ఆస్వాదించండి’’అని పేర్కొంది. 

బర్గర్‌కింగ్‌ ప్రకటన పట్ల నెటిజన్లు ఫిదా అయ్యారు.. సంస్థపై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు. ‘నిజమే ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రజల అండ అవసరం’, ‘బర్గర్‌కింగ్‌ది గొప్ప ఆలోచన’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రకటనను ట్వీటర్‌లో పెట్టిన గంటల వ్యవధిలోనే లక్షన్నర లైకులు వచ్చాయి. 50వేల మందికిపైగా ట్వీట్‌ను షేర్‌ చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని