కొవిడ్‌ టీకా: పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవచ్చా..?

కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్‌ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

Published : 04 Feb 2021 18:49 IST

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో వచ్చే నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా, కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్‌ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని స్పష్టంచేస్తున్నారు. వీటిపై ఆధారాలు తక్కువగానే ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ పనితీరును నొప్పి నివారణ మందులు(పెయిన్‌ కిల్లర్లు) ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు.

శరీరంలో వైరస్‌ ఉందని భావించి, వాటిని ఎదుర్కొనే రోగనిరోధకత కణాల పెరుగుదలకు మనం తీసుకునే వ్యాక్సిన్‌లు కృషిచేస్తాయి. అయితే, వీటి ప్రతిచర్యలో భాగంగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు కొందరు నొప్పి నివారణ మందులను వాడతారు. ఇలాంటి నొప్పులను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందుల వల్ల రోగనిరోధకత ప్రతిస్పందనకు ఆటంకం కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ లక్షణాలే మీ రోగనిరోధక శక్తి పుంజుకుంటుందని, వ్యాక్సిన్‌ పనిచేస్తుందనడానికి నిదర్శనం. అనారోగ్య సమస్యలతో తీసుకునే పెయిన్‌ కిల్లర్స్ వ్యాక్సిన్‌ తీసుకున్నాక వచ్చే రోగనిరోధకతను అడ్డుకునే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం(సీడీసీ) నిపుణులు డాక్టర్‌ రోచెల్లీ వాలెన్‌స్కై స్పష్టంచేశారు. ఇలాంటి మందులు వ్యాక్సిన్‌ వల్ల వృద్ధిచెందే యాంటీబాడీల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. తాజాగా వీటికి సంబంధించిన పరిశోధన పత్రం జర్నల్‌ ఆఫ్‌ వైరాలజీలో ప్రచురితమైంది.

పెయిన్‌ కిల్లర్లను తీసుకునే అలవాటు ఉన్నవారు తప్ప, మిగతా వారు వ్యాక్సిన్ తీసుకునే ముందు, వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవాల్సి వస్తే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా, ఇలాంటి నొప్పి నివారణ మందులు వాడకపోవడమే మంచిదని  యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వైద్యులు పేర్కొంటున్నారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే రోగనిరోధకతపై ప్రభావం చూపని ఎసిటమైనోఫెన్‌(టైలెనోల్‌) వంటి మందులు వాడవచ్చని సూచిస్తున్నారు. ఇక, వ్యాక్సిన్‌ తీసుకున్న చోట నొప్పి ఉన్నట్లయితే, చల్లని తడిబట్టతో అక్కడ మర్దన చేసుకోవాలి, జ్వరం ఉన్నట్లయితే పండ్లరసాలను తీసుకోవాలని సీడీసీ సూచిస్తోంది.

ఇవీ చదవండి..
కరోనా టీకా: డోసుల వ్యవధి ఎంత ఉండాలి?
కొవిడ్‌ టీకా: పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు తప్పవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని