Weight Loss: బరువు తగ్గాలంటే కంటి నిండా నిద్ర ఉండాల్సిందేనా?

చాలా మందిని వేధిస్తున్న సమస్య ‘అధిక బరువు’. దీని నుంచి బయటపడాలంటే ఆహార నియమాలు, వ్యాయామంతోపాటు సరిపాడా నిద్ర కూడా అవసరమని చెబుతున్నారు. అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓసారి చూద్దామా?

Published : 06 Oct 2022 11:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. దీంతో రకరకాల ఆనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో ‘అధిక బరువు’ ప్రధానమైనది. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే, కంటి నిండా నిద్రపోయినప్పుడే బరువు తగ్గేందుకు అవకాశముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి నిద్ర తప్పని సరి

బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే, రాత్రిపూట కచ్చితంగా పడుకోవాల్సిందే. ఉద్యోగ రీత్యా కొందరు రాత్రిపూట పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికబరువు సమస్యని ఎదుర్కోక తప్పదట. అలాంటివారు ముందుగానే వైద్యనిపుణుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొందరు బరువు తగ్గాలనుకొని డైటింగ్‌, వ్యాయామాలపై దృష్టి పెడతారు.కానీ, నిద్రను సరిగా పట్టించుకోరు. మానసిక, శారీరక ఆరోగ్యం నిద్రపైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఊబకాయం, జీర్ణవ్యవస్థలు కూడా నిద్రపైనే ఆధారపడి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

8 గంటలు నిద్రపోతున్నారా?

బరువు అదుపులో ఉండాలంటే కనీసం 8 గంటల నిద్ర అవసరం. లేదంటే బరువు తగ్గడం కంటే పెరిగిపోవడానికే అవకాశాలు ఎక్కువట. ఎందుకంటే పడుకోకుండా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించుకుంటుంది. ఫలితంగా మనకు తెలియకుండా ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. నాలుగు గంటల కంటే తక్కువగా పడుకున్న వారిలో దాదాపు 10శాతం అనవసరపు కొవ్వులు పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. కనీసం 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరిగా నిద్రలేకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. చిరాకు, పని పట్ల నిరాసక్తి, పనితీరు మందగించడం,బద్ధకం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఆకలిని అదుపులో పెట్టుకోండి

బరువు తగ్గాలంటే నిద్రతోపాటు ఆకలిని కూడా అదుపులో పెట్టుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. గ్రెలిన్‌, లెప్టిన్‌ అనే హార్మోన్లు ఆకలిని నియంత్రిస్తాయి. సరిపడా నిద్రలేకపోతే గ్రెలిన్‌ అధికంగా విడుదలవుతుంది. ఫలితంగా విపరీతమైన ఆకలేస్తుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. మరోవైపు లెప్టిన్‌ అనే హార్మోను ఆకలిని అదుపులో ఉంచుతుంది. అతిగా తినకుండా సంతృప్తి పడేలా చేస్తుంది.

ఆహారంలోనూ మార్పులు చేయాలి

రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆహారంలోనూ చిన్నపాటి మార్పులు చేసుకోవాలి.హెవీఫుడ్‌ కాకుండా త్వరగా జీర్ణమయ్యే గింజలు, పండ్లు, పాలు తీసుకోవడం మంచిది. పడుకునే ముందు అల్లం టీ తాగినట్లయితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందట. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందైనా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పడుకునేటప్పటికి ఆహారం దాదాపు అరిగిపోయి, జీర్ణ అవయవాలు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే, సరిగా జీర్ణం కాకుండా అనవసరపు కొవ్వులుగా తయారై పొట్టలోనే పేరుకుపోతాయి. దీంతో ఊబకాయం వచ్చే ప్రమాదముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని