Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
తెదేపా అధినేత చంద్రబాబు రెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం చేరుకున్నారు.
రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో కార్లలో బయల్దేరారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ వాటన్నింటినీ దాటుకొని రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇంకొంత మంది మార్గమధ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత ప్రాంతానికి రావడానికి ఆంక్షలు విధించడంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని, పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న కొందరు ఐటీ ఉద్యోగులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ సతీమణి బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.
మరోవైపు ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసులు శనివారమే స్పష్టం చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాటాటా ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అన్ని ఆంక్షలను దాటుకుంటూ ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి చేరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.