Telangana News: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై క్యాట్‌ ఆగ్రహం

ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మొహంతిని రెండు వారాల్లో  విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్) ఆదేశించింది...

Updated : 25 Feb 2022 20:26 IST

హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మొహంతిని రెండు వారాల్లో  విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్) ఆదేశించింది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై అభిషేక్‌ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ట్రైబ్యునల్‌ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. అధికారుల విభజనలో భాగంగా మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. కేటాంపు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్‌ మొహంతిని రిలీవ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, విధుల్లోకి చేర్చుకోవాలని తెలంగాణను 8 నెలల క్రితం ఆదేశించింది.

క్యాట్‌ఆదేశాల మేరకు మొహంతిని ఏపీ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడం లేదంటూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై మొహంతి క్యాట్‌లో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. గతంలో విచారణ జరిపిన క్యాట్‌.. ఇవాళ హాజరు కావాలని సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది. హాజరుకు మినహాయింపు ఇవ్వాలని, త్వరలో కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ క్యాట్‌ను కోరారు. నిరాకరించిన ట్రైబ్యునల్‌ గంటలోగా కనీసం ఆన్‌లైన్‌లో హాజరు కావాలని లేకపోతే నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వర్చువల్‌ విచారణకు హాజరైన సోమేశ్‌ కుమార్‌... అభిషేక్‌ మొహంతి వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. తాము ఆదేశించినప్పటికీ విధుల్లోకి ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలతోనే తెలంగాణలో కొనసాగుతున్నారంటూ సోమేశ్‌ కుమార్‌నుద్దేశించి వ్యాఖ్యానించిన ట్రైబ్యునల్‌ .. అవసరమైతే ఉత్తర్వులను పునఃసమీక్షిస్తామని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని