CBI: వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు.. అవినాష్‌రెడ్డే చెప్పారా?: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. 

Updated : 26 May 2023 20:00 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి అనుబంధ కౌంటర్‌లో సీబీఐ కీలక విషయం ప్రస్తావించింది. వివేకా మృతి విషయం జగన్‌కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ‘‘వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు. జగన్‌కు అవినాష్‌రెడ్డే  చెప్పారా? అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది. విచారణకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. హత్య వెనుక భారీ కుట్రను చెప్పేందుకు అవినాష్‌రెడ్డి ముందుకు రావడం లేదు. హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 వరకు అవినాష్‌ వాట్సప్‌ కాల్స్‌ మాట్లాడారు. ఈనెల 15న నోటీసు ఇస్తే నాలుగు రోజులు సమయం కావాలన్నారు. ఈనెల 19న నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు.

తల్లి అనారోగ్యం పేరుతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్‌ విడిచి వెళ్లారు. విచారణకు రావాలని ఫోన్‌ చేసి కోరినా రాలేదు. ఈనెల 22న నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రానన్నారు. అవినాష్‌ అరెస్టుకు ఈనెల 22న మా బృందం కర్నూలు వెళ్లింది. అతని అనుచరులను చూసి శాంతిభద్రతల సమస్య రావొచ్చని అనిపించింది. జూన్‌ 30లోగా వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాష్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు. అవినాష్‌ను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉంది’’ అని సీబీఐ అధికారులు అనుబంధ కౌంటర్‌లో వెల్లడించారు.

మరో వైపు వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. శనివారం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు