Viveka Murder case: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపింది.

Updated : 15 May 2023 18:06 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్‌ ద్వారా సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం పులివెందులకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఎలాగైనా మంగళవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని ఇప్పటికే విచారించిన సీబీఐ.. దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ నోటీసులు జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. అవినాష్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అతడికి బెయిల్‌ ఇస్తే.. దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఉదయ్‌కుమార్‌ బెయిల్‌పై బయటకి వస్తే.. సాక్షులను బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని, పలువురి నుంచి ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. వివేకా హత్య సంగతి బయటి ప్రపంచానికి తెలియక ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలిసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్య తర్వాత వివేకా మృతదేహానికి కుట్లువేసి, రక్తపు వాంతులతో చనిపోయారని నమ్మించడంలో ఉదయ్‌కుమార్‌రెడ్డిదే కీలక పాత్ర అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు