Viveka Murder case: అవినాష్‌రెడ్డిని నాలుగు గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌ రె డ్డిని  సీబీఐ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు.

Updated : 14 Mar 2023 16:20 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు(Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి(MP Avinash Reddy)ని సీబీఐ(CBI) అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో ఇప్పటి వరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి. 

వివేకా హత్యకేసు విషయం బాహ్య ప్రపంచానికి ఉదయం 6గంటలకు తెలిస్తే.. అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి  అంతకు ముందే తెలుసని సీబీఐ భావిస్తోంది. హత్యాస్థలిలో రక్తపు మరకలు తుడిచివేయడం, మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి తరలించడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారనేది సీబీఐ వాదన. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు..  ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ 15 నిమిషాల పాటు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భారీ కుట్ర చేసి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. అవినాష్‌రెడ్డి కాల్‌ డేటా ఆధారంగా ఆర్థిక పరమైన, రాజకీయ అంశాలతో కూడిన కుట్రతో హత్య జరిగి ఉండొచ్చని సీబీఐ భావిస్తోంది. ఈ అనుమానాల నివృత్తి కోణంలోనే అవినాష్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.. తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని