Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ.. పులివెందులలో అధికారుల మకాం!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారుల బృందం అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లడం, వారి గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారాయి.

Updated : 25 Jan 2023 17:51 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. గత ఐదు రోజుల నుంచి పులివెందులలో మకాం వేసిన అధికారులు మరోసారి కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈనెల 28న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. పులివెందులలోని అవినాష్‌ రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో దాదాపు ఐదుగురికిపైగా అధికారుల బృందం వెళ్లింది. సుమారు 15నిమిషాలపాటు ఇంటి వద్దే ఉన్నారు. ఆ సమయంలో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో వారిద్దరి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లారు? అనే విషయాన్ని ఇంట్లో పనిచేసే వాళ్లని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 

అనంతరం అవినాష్‌రెడ్డి ఇంటి చుట్టు పక్కల పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. దాదాపు గంటన్నరకు పైగా వాహనాల్లో పులివెందులలోనే చక్కర్లు గొట్టారు. హత్యకు గురైన వివేకానందరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ మరోసారి పరిశీలించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అవినాష్‌రెడ్డి ఇంటికి అధికారులు ఎందుకు వెళ్లారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పులివెందులలో ఉన్న మరికొంత మందికి నోటీసులు ఇవ్వడానికి సీబీఐ అధికారుల బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాళ్లందరు ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపైనే సీబీఐ అధికారులు ఎక్కువగా నిఘా పెట్టారు. హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వీరిద్దరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించడంతో విచారణకు పిలిచి పూర్తిస్థాయిలో లోతైన దర్యాప్తు చేయాలని సీబీఐ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని