Hyderabad: తెలంగాణలో కర్ఫ్యూ లేని పాలన .. ఆ ఘనత పోలీసులదే: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత  తెలంగాణ పోలీసులకే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు

Updated : 04 Jun 2023 20:26 IST

హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవి. భద్రత ఉండదు, రౌడీల రాజ్యంగా మారుతుందని దుష్ప్రచారం జరిగింది. కానీ, ఆ అపోహలను పటాపంచలు చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత తెలంగాణ పోలీసులకే దక్కుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆడ బిడ్డలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆడ పిల్లల కంట కన్నీరు రావొద్దనే వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని షీ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు ఆదర్శం: నాని

‘‘హైదరాబాద్‌లో మహిళలకు ప్రభుత్వం భద్రత కల్పించింది. పోలీసులు మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేను షూటింగ్‌ కోసం ఎక్కడికి వెళ్లినా తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది’’ అని సినీనటుడు నాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని