Telangana news: కేంద్రంపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవం: కేంద్ర పౌరసరఫరాల శాఖ

తెలంగాణ రైతుల నుంచి బియ్యం సేకరణ విషయంలో కేంద్రంపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే

Published : 12 Apr 2022 01:26 IST

దిల్లీ: తెలంగాణ రైతుల నుంచి బియ్యం సేకరణ విషయంలో కేంద్రంపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే అన్నారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండదని.. ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామని స్పష్టం చేశారు. బియ్యం సేకరణపై అన్ని రాష్ట్రాలను వివరాలు గతంలోనే కోరామన్నారు. అయితే, రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది వాస్తవమని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదని చెప్పారు. పంజాబ్‌ నుంచి ఒక్క గింజకూడా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేదని, అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరిస్తోందని వెల్లడించారు.

‘‘అత్యధికంగా తెలంగాణ నుంచి 48.8 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ తీసుకున్నాం. ఆ రాష్ట్రం విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్‌ రైస్‌ సేకరించాం. ఎఫ్‌సీఐ వద్ద ఇప్పటికే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఉంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల నుంచి బాయిల్డ్‌ సేకరణను తగ్గించాం. ధాన్యం సేకరణపై ఫిబ్రవరిలోనే ప్రణాళికలు రూపొందించాం. రెండు సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నాం. ధాన్యం విషయంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలే అవగాహన కల్పించాలి. ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదు. ధాన్యం మిల్లింగ్‌ చేసినందుకు మిల్లర్లకు డబ్బు చెల్లిస్తున్నాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని