Polavaram: పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు.. ప్రత్యేక హోదా లేనే లేదు: కేంద్రం

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు.

Updated : 12 Dec 2022 17:54 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది.  రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

‘‘వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచింది. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసింది. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమే..

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని వైకాపా ఎంపీ ప్రశ్నించగా.. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు.

చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమే..

‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లు ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసింది. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ. 29,027.95 కోట్లు. 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లకు పెరిగింది. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు ఏపీ ప్రభుత్వానికి చెల్లించాం. చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమే’’ అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని