Cyclone Yaas: బెంగాల్‌కు కేంద్ర ప్రత్యేక బృందం

యస్‌ తుపాను విలయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం పంపనుంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే షహి

Published : 06 Jun 2021 20:35 IST

తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నట్టు తెలిపిన హోంశాఖ

దిల్లీ: యస్‌ తుపాను విలయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం పంపనుంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే షహి నేతృత్వం వహించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బృందం అక్కడ మూడు రోజుల పాటు పర్యటించనున్నట్టు తెలిపాయి. ఈ బృందం 24 పరగణాస్‌, తూర్పు మిడ్నాపుర్‌ జిల్లాలో పర్యటిస్తారని హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అనంతరం  అక్కడి ఆర్థిక, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. తుపాను ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెల నిర్వహించిన సమీక్షా సమావేశానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాకపోవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశం జరిగిన కొద్దిరోజుల్లోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

యస్‌ తుపాను గత నెల 26న ఒడిశాలో విధ్వంసం సృష్టించింది. పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌పైనా తుపాను ప్రభావం భారీగా పడింది. తుపాను కారణంగా రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల మేర ఆస్తి, పంట నష్టం జరిగిందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 18 లక్షల మంది ప్రజలపై తుపాను  ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. 2.21 లక్షల హెక్టార్లలో పంట, 71,560 హెక్టార్లలో తోటలు నాశనం అయినట్లు వివరించారు. 

 ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 28న  బెంగాల్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.  అనంతరం కలైకుందా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధానిని కలిసినప్పటికీ.. దీదీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్‌ బంద్యోపాధ్యాయ్‌ ఆ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో బంద్యోపాధ్యాయ్‌ను కేంద్ర సర్వీసుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అయితే ఆయన దిల్లీకి వెళ్లకపోగా.. మే 31న పదవీ విరమణ తీసుకున్నారు.  దీంతో ఆగ్రహించిన కేంద్ర హోంశాఖ విపత్తు నిర్వహణ చట్టం కింద ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నిర్వహించిన సమావేశానికి హాజరు కానందుకు ఆ చట్టం ప్రకారం ఆయనకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేంద్రం చర్యపై మమత మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారం కోసమే ఆయన్ను కేంద్రం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అనంతరం దీదీ ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని