3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా

సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌(పీఎమ్‌ఏవైయూ) పథకం కింద 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

Published : 10 Jun 2021 01:30 IST

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మంచనున్నట్లు వెల్లడి

దిల్లీ: సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌(పీఎమ్‌ఏవైయూ) పథకం కింద 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.  దిల్లీలో మంగళవారం నిర్వహించిన కేంద్ర కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ(సీఎస్‌ఎమ్‌సీ) 54 వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణం కోసం వచ్చిన 708 ప్రతిపాదనలకు ఈ సందర్భంగా అంగీకారం తెలిపినట్టు కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గృహాలను బహుళ అంతస్తుల గృహ సముదాయాలుగా నిర్మించనున్నట్టు తెలిపింది.  ఈ సందర్భంగా ‘పీఎమ్‌ఏవైయూ అవార్స్డ్‌ 2021- 100 రోజుల ఛాలెంజ్‌’ను ప్రారంభించింది.  పీఎమ్‌ఏవైయూ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు  ఈ అవార్డులను ఇవ్వనున్నట్టు పేర్కొంది. 

ఇప్పటివరకు పీఎమ్‌ఏవైయూ పథకం కింద 112.4 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపింది. నిర్మాణం ప్రారంభించిన 82.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే 48.31 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించినట్లు పేర్కొంది. ఈ పథకం మొత్తం పెట్టుబడి వ్యయం రూ.7.35 లక్షల కోట్లుగా వెల్లడించింది. అందులో కేంద్రం వాటా 1.81 లక్షల కోట్లు కాగా..  రూ.96,067 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఆరు లైట్‌ హౌస్‌ ప్రాజెక్టుల గురించి సమావేశంలో పాల్గొన్న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించింది. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా మాట్లాడుతూ.. మిగులు నిధులను సద్వినియోగం చేసుకోవడం, తలపెట్టిన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంపైనే తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు