Mineral Blocks Auction: జూన్‌ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన

Mineral Blocks Auction: గత 9 ఏళ్లలో ఏ ఒక్క మినరల్‌ బ్లాక్‌కూ తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని కేంద్ర గనులశాఖ తెలిపింది. ఈ నెలాఖరులోగా కనీసం 6 బ్లాకులకు వేలం నిర్వహించాలని సూచించింది. లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందని పేర్కొంది.

Updated : 16 Jun 2024 14:55 IST

దిల్లీ: తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్‌ బ్లాక్‌ను కూడా వేలం (Mineral Blocks Auction) వేయలేదని కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. జూన్‌ 30 నాటికి కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్‌కు 11 బ్లాకుల జియాలాజికల్‌ నివేదికలను పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఐదు ఇనుప ఖనిజం, ఐదు సున్నపురాయి, ఒకటి మాంగనీస్‌ బ్లాకు ఉన్నట్లు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ పలుమార్లు గుర్తు చేసినప్పటికీ.. ఒక్క బ్లాక్‌ను కూడా వేలం (Mineral Blocks Auction) వేయలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 30 నాటికి కచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తిచేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈ విషయంలో విఫలమైతే.. ఆ ప్రక్రియను కేంద్రమే చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

మినరల్‌ బ్లాకుల వేలం (Mineral Blocks Auction) ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. 2021లో నిబంధనలను సవరించారు. వాటి ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలి. లేదంటే వాటిని నిర్వహించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 ప్రధాన మినరల్‌ బ్లాక్‌లను వేలం వేశారు. 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరిగింది.

తెలంగాణలో మేజర్, మైనర్‌ మినరల్‌ బ్లాకులను వేలం (Mineral Blocks Auction) పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలిపాయి. ఇందులో మూడు సున్నపురాయి బ్లాకులు కాగా, మరో 12 చిన్నతరహా ఖనిజాలని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనుల్ని 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని