Vishal Garg: జూమ్‌ కాల్‌లో.. 900 మంది ఉద్యోగులను తొలగించి..!

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోంలు పెరిగిన తర్వాత ఉద్యోగులతో సమావేశాల కోసం కంపెనీలు జూమ్‌ కాల్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఓ సంస్థ

Updated : 07 Dec 2021 04:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోంలు పెరిగిన తర్వాత ఉద్యోగులతో సమావేశాల కోసం కంపెనీలు జూమ్‌ కాల్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఓ సంస్థ సీఈవో కూడా తన ఉద్యోగులకు జూమ్‌ కాల్‌ చేశారు. కానీ, అది మీటింగ్‌ కోసం కాదు.. ఉద్యోగులను తొలగించేందుకు. అయితే ఆయన తొలగించిందో ఒకరిద్దరిని కాదండోయ్‌.. ఏకంగా 900 మంది ఉద్యోగులను ఒకేసారి కంపెనీ నుంచి తీసేశారు. 

అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌.. జూమ్‌ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ఆయన కంపెనీ సిబ్బంది మొత్తంలో 9శాతానికి సమానం కావడం గమనార్హం. సమర్థత, పనితీరు తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు విశాల్‌ వెల్లడించారు. 

గత బుధవారం విశాల్‌ తన ఉద్యోగుల్లో కొంతమందికి జూమ్‌ ద్వారా వీడియో కాల్‌ చేశారు. ‘‘ఇలాంటి వార్త మీరు వినాలనుకోరు. కానీ ఒకవేళ మీరు దురదృష్టవశాత్తూ ఈ కాల్‌ గ్రూప్‌లో ఉన్నట్లయితే.. మీ ఉద్యోగాన్ని తక్షణమే తొలగిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నా కెరీర్‌లో ఇది రెండోసారి. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డా. ఏడ్చాను కూడా. కానీ ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నా. మార్కెట్‌, సమర్థత, పనితీరు తదితర కారణాలతో కంపెనీలోని 15శాతం సిబ్బందిని తక్షణమే తొలగిస్తున్నాం’’ అని విశాల్ గార్గ్‌ ఉద్యోగులకు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు కనీసం సగటున 2 గంటలు కూడా పనిచేయడం లేదని ఆగ్రహించారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఉద్యోగి ఇటీవల సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ విభాగాలకు చెందిన మొత్తం ఉద్యోగులను విశాల్‌ తొలగించారు. దీనిపై బెటర్‌.కామ్‌ అధికార ప్రతినిధి కూడా స్పందించారు. అయితే విశాల్ చెప్పినట్లు 15శాతం సిబ్బంది కాదని, 9శాతం సిబ్బందిని తొలగించినట్లు వెల్లడించారు. కాగా.. విశాల్‌ గార్గ్‌ ఇలాంటి వార్తల్లో నిలవడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇలాగే ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారాయన. ఆ విషయాన్ని తన సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా తెలిపారు. అప్పుడు ఆయనపై విమర్శలు వచ్చాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని