హ్యాకింగ్‌ నేపథ్యంలో ట్విటర్‌కు కేంద్రం నోటీసులు?

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురవ్వడంతో భారత సైబర్‌ భద్రతా నోడల్‌ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ అప్రమత్తమైంది. ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని...

Published : 18 Jul 2020 18:58 IST

(హ్యాకర్లు దాడి చేశారని ట్విటర్‌ ప్రకటిస్తున్న చిత్రం)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖల ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురవ్వడంతో భారత సైబర్‌ భద్రతా నోడల్‌ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ అప్రమత్తమైంది. ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశించింది. ప్రస్తుత సైబర్‌ దాడి వల్ల ఎంత మంది భారతీయుల సమాచారంపై ప్రభావం పడిందో వెల్లడించాలని కోరింది.

హానిచేసే ట్వీట్లనూ, లంకెలనూ ఎంతమంది భారతీయులు సందర్శించారో సమాచారం ఇవ్వాలని ట్విటర్‌ను సెర్ట్‌-ఇన్‌ కోరిందని తెలిసింది. హ్యాకింగ్‌కు గురైన వారికి, ఇతరులు యాక్సెస్‌ చేశారన్న విషయం చెప్పారా అని ప్రశ్నించింది. భారతీయుల సమాచారానికి ఎంత ముప్పు ఉంది? ఏ రకంగా హ్యాకర్లు దాడి చేశారు? ముప్పు తగ్గిస్తూ తీసుకున్న చర్యల గురించి సెర్ట్‌-ఇన్‌ అడిగిందని తెలుస్తోంది.

మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌పై శుక్రవారం అంతర్జాతీయంగా సైబర్‌ దాడి జరిగింది. జో బైడెన్‌, బరాక్‌ ఒబామా, జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌, ఎలన్‌ మస్క్‌ వంటి ప్రముఖుల ఖాతాలను హ్యాక్‌ చేశారు. కొన్ని ఖాతాల పాస్‌వర్డులు మార్చారు. కొన్నింటి సమాచారాన్ని పూర్తిగా చోరీ చేశారు. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కొందరు నేతల ప్రైవేటు సందేశాలనూ తస్కరించారని తెలిసింది. అయితే తమ ఉద్యోగులను నియంత్రించి కొన్ని రహస్య విషయాలను తెలుసుకొని హ్యాకర్లు దాడి చేశారని ట్విటర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని