AP News: బంగార్రాజు హత్యపై పోలీసులు స్పందించాలి: డీజీపీకి చంద్రబాబు లేఖ

ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం జిల్లా నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అక్రమ భూ కబ్జాలు, హత్యలతో క్రైమ్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని

Updated : 06 Nov 2021 17:30 IST

అమరావతి: ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం జిల్లా నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అక్రమ భూ కబ్జాలు, హత్యలతో క్రైమ్‌ క్యాపిటల్‌గా మారిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో విద్యుత్‌ లైన్‌మెన్‌ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న బీసీ కులానికి చెందిన బంగార్రాజు దారుణహత్యకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు. 

ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథిగృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనప్పటికీ ఇంకా పోస్టుమార్టం చేయకపోవడం విచారకరమని ఆక్షేపించారు. మృతుడి ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం విశాఖపట్నంలో శాంతిభద్రతల సమస్య మరింత పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. హత్యలో అధికార వైకాపాకి చెందిన అగ్రనేతల ప్రమేయం ఉండటంతో పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి హత్యకేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని