Chandrababu: తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated : 28 Jan 2023 21:03 IST

బెంగళూరు: నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ, అక్కడికంటే బెంగళూరులో ట్రీట్‌మెంట్‌ బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2గంటలకు ఇక్కడి తీసుకొచ్చారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోలుకోవడానికి ఇంకా టైమ్‌ పడుతుందని తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ కూడా విడుదల చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని పురందేశ్వరి చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్‌ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని