Eye care: కంట్లో రసాయనాలు పడితే ఏం చేయాలో తెలుసా?

మహిళలు ఇంట్లో వంట చేసినపుడు కారం, ఇల్లు శుభ్రం చేసినపుడు దుమ్ము, బ్లీచింగ్‌ పడడం..పురుషులు సిమెంట్‌, సున్నం పని చేసినపుడు కంట్లో పడేందుకు అవకాశాలు చాలా ఉంటాయి

Updated : 21 May 2022 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలు ఇంట్లో వంట చేసేటప్పుడు కారం, ఇల్లు శుభ్రం చేసినప్పుడు దుమ్ము, బ్లీచింగ్.. పురుషులు సిమెంట్‌, సున్నం పని చేసినప్పుడు కంట్లో పడేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థులు ప్రయోగాలు చేసినప్పుడు రసాయనాలు కంట్లో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రమాదం జరిగితే నీటితో కడగాలే తప్ప సొంత వైద్యం పనిచేయదని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాలతో కంటికి ఇబ్బందులు కలగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కంటి వైద్యులు రవికుమార్‌రెడ్డి పలు సూచనలు చేశారు.

ఈ కష్టం వద్దు సుమా: సున్నం, సిమెంటు, కారం, పసుపు, రసాయనాలు ఏవైనా కంట్లో పడితే చూపు దెబ్బతీస్తాయి. ఆ చూపును తిరిగి తెప్పించడం చాలా కష్టం. కాల్షియం హైడ్రాక్సైడ్‌ ఉండే సున్నం చాలా ప్రమాదకరం. కంట్లో పడితే తినేస్తుంది. యాసిడ్‌ పడినా అక్కడ ముద్దలాగా మారుతుంది. కంట్లో ఏం పడిందో స్పష్టంగా చెప్పినపుడే వైద్యం చేయడం కాస్త సులువుగా ఉంటుంది.

నీటితో కడిగితే బాగు : కంట్లో ఏదైనా పడితే దాని అవశేషాలు పోయేదాకా ఆసుపత్రిలో నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు. రసాయనాలు పడినపుడు వెంటనే శుభ్రం చేస్తే సమస్య తొలగిపోదు. ఒక్కో చుక్క నీటిని కంటిలో రెండు, మూడు గంటలు పడేలా చేస్తాం. అప్పుడే దాని తీవ్రత తగ్గుతుంది.  తర్వాత స్టిరాయిడల్‌ డ్రాప్స్‌ రెండు వారాలు వాడాలి. అవసరమైతే శస్త్రచికిత్స చేయకతప్పదు.

జాగ్రత్తలు తప్పనిసరి: సున్నం, సిమెంటు పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట్లో పడకుండా కళ్లాద్దాలు, హెల్మెట్‌గానీ పెట్టుకోవాలి.  బాత్‌, వాష్‌రూముల్లో యాసిడ్స్‌ చిన్నారులకు దూరంగా ఉంచాలి. రైతులు క్రిమిసంహారక మందులను చల్లే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. చేతి తొడుగులు, కళ్లాద్దాలు వాడాలి. పరిశ్రమల్లో పని చేసే ప్రదేశంలో హెచ్చరిక సూచికలు పెట్టాలి. కార్మికులకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటే కళ్లను కాపాడుకోవడానికి వీలుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని