Published : 09 Apr 2021 11:21 IST

ఈ ఏడాదిలో హిడ్మా కథ ముగిస్తాం..!

మావోయిస్టులు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారన్న డీజీ

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా వారి కథ ముగిస్తామన్నారు.

హిడ్మా విషయంలో చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ ఫలితం గురించి నర్మగర్భంగా చెప్పారు. నక్సల్స్‌పై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌ పేర్కొన్నారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందని పేర్కొన్నారు.

సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌లో అతడు వేసిన వ్యూహంలో బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని అన్నారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ 4 ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు.

బుల్లెట్లు వర్షంగా కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ, గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని, వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ ఆపరేషన్‌ కోసం ఆ ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు తెలిపారు. నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని