Published : 04 Jul 2021 01:32 IST

సరోగసీకి కేంద్రంగా ఉక్రెయిన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూరప్‌లో  రెండో అతి పెద్దదేశమైన ఉక్రెయిన్‌ ప్రస్తుతం పిల్లలను ఉత్పత్తి చేసే కర్మాగారంలా మారింది. అద్దెగర్భం, సంతాన సాఫల్య వ్యాపారాన్ని అక్కడ చట్టబద్ధం చేయడంతో విదేశీ దంపతులు వీటిని పొందేందుకు బారులు తీరుతున్నారు.  పిల్లలు లేని విదేశీయులు అక్కడి దాతల నుంచి అండం, వీర్యం, ఫలదీకరణం చెందిన అండం(ఎంబ్రియో) ద్వారా పిల్లలను పొందుతున్నారు.  ప్రతి ఏటా విదేశీయులకోసం ఆ దేశంలో దాదాపు 3000 మందికి పైగా శిశువుల్ని కంటున్నారు. 2000 సంవత్సరం నుంచి  సరోగసీ విధానం ఉక్రెయిన్‌లో కొనసాగుతోంది. కానీ ఇటీవల వాణిజ్యపరంగా ఉక్రెయిన్‌లో ఇది బాగా పుంజుకుంది. ఎందుకంటే.. గత ఐదేళ్లుగా భారత్‌, థాయ్‌లాండ్‌ తదితర ఆసియా దేశాల్లో విదేశీయులు అద్దెగర్భం పొందడాన్ని నిషేధించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు పిల్లలకోసం వచ్చే దంపతుల్లో మూడోవంతు చైనా నుంచే వస్తుంటారు.

ఈ విధానం సరైనదేనా?
యూరప్‌లోని పేదదేశాల్లో ఒకటిగా ఉండటం, ఎంతోమంది తమ గర్భాన్ని అద్దెకిచ్చేందుకు ముందుకొస్తుండటం వల్ల ఈ విధానం ఆ దేశంలో బాగా కొనసాగుతోంది. పైగా అద్దెగర్భానికి ధర కూడా ఓ మోస్తరుగానే ఉండటంతో పిల్లలు కావాలనుకునే విదేశీ దంపతులు ఎక్కువగా ఉక్రెయిన్‌ వైపే చూస్తుంటారు. దాంతో మెడికల్‌ టూరిజం బాగా వృద్ధి పొందింది.  పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు ఇదివరకే పెళ్లయినట్లు, ఇక సహజంగా తమకు పిల్లలు పుట్టే అవకాశం లేనట్లు వైద్యపరంగా ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రంగంలో పనిచేస్తున్న వైద్యులతో సమావేశాలు కూడా జరుగుతుంటాయి. ఆ దేశ రాజధాని నగరం కీవ్‌లోని  బయోటెక్స్‌ కామ్‌ అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో సరోగసీకి సంబంధించి అనేక వివరాలను ప్రకటించింది. ఇంకా ఇలాంటి సంస్థలు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా ఉన్నాయి. సంతానయోగం లేని దంపతులకు దీనివల్ల ఎంతో లబ్ధి చేకూరుతోంది. అయినప్పటికీ చాలావరకు అక్కడి పేదరికాన్ని ఆసరాగా చేసుకునే ఈ విధానం కొనసాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. తమదేశంలో వాణిజ్యపరంగా దీన్ని అనుమతించడం సరికాదనీ అక్కడి సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని