నిప్పుల పూలే టపాసులు.. కృష్ణా జిల్లా చిన్నారుల పర్యావరణహిత దీపావళి

దీపావళి అంటే టపాసుల మోత మోగిపోతుంది. తల్లిదండ్రుల వద్ద చిన్నారులు మారాం చేసి మరీ పెద్దఎత్తున బాణసంచా కొనుగోలు చేయిస్తారు. కానీ.. అక్కడి చిన్నారులు పర్యావరణానికి హాని కలగకుండా వెలుగుల పండుగ జరుపుకొంటారు.

Published : 05 Nov 2021 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి అంటే టపాసుల మోత మోగిపోతుంది. తల్లిదండ్రుల వద్ద చిన్నారులు మారాం చేసి మరీ పెద్దఎత్తున బాణసంచా కొనుగోలు చేయిస్తారు. కానీ.. అక్కడి చిన్నారులు పర్యావరణానికి హాని కలగకుండా వెలుగుల పండుగ జరుపుకొంటారు. అయితే ఎలాంటి సందడీ ఉండదనుకుంటే పొరపాటే. దీపావళికి ముందు నుంచి నాగులచవితి వరకూ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ధ్వని కాలుష్యం లేకుండా దీపావళి పండుగ చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన చిన్నారులు. 

దీపావళి వేడుకల్లో.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి చిన్నారులు.. మతాబులు, చిచ్చుబుడ్లు కావాలంటూ తల్లిదండ్రులను అడగరు. టపాసులు పేల్చితే పర్యావరణ కాలుష్యం పెరుగుతుందంటూ.. అనవసర ధ్వని కాలుష్యం ఎందుకని భావిస్తున్నారు. వాటికయ్యే డబ్బు పొదుపు చేసుకుంటున్నారు. అదే సమయంలో దీపావళిని పాత పద్ధతుల్లోనే సరికొత్తగా చేసుకుంటున్నారు. పండుగకు పది రోజుల ముందే రంపపు పొట్టు , తాటి గులకలు కాల్చి.. వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ పొడిని ఓ వస్త్రంలో గుండ్రంగా చుట్టి, దానికి ఆవు పేడ రాసి.. ఎండలో మూడు రోజులు ఎండబెడతారు. తాటి చెట్టు కమ్మను చీల్చి.. ఆ పొట్లాన్ని అందులో ఉంచి, పైన తాడు కట్టి వేగంగా తిప్పడంతో చుట్టూ నిప్పు రవ్వలు చిమ్ముతూ నిప్పుల వాన కురుస్తుంది. నిప్పుల పూలు వెలుగులు విరజిమ్ముతాయి. పూర్వకాలంలో టపాసులు, రసాయన మందుగుండు సామగ్రి అందుబాటులో లేనప్పుడు గ్రామాల్లో ఈ విధంగా దీపావళి జరుపుకొనేవారు. టపాసులు చాలా తక్కువ సమయంలోనే కాలిపోతాయి. కానీ.. ఇవి గంట వరకు నిప్పురవ్వలు చిమ్ముతూనే ఉంటాయి. ఇలా తిప్పే సమయంలో నిప్పురవ్వలు మనిషిపై పడినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. పైగా ఇలా తిప్పడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న ఇలాంటి గ్రామాలను ప్రభుత్వం గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని