చైనాలో మనిషికి సోకిన హెచ్‌5ఎన్‌6 బర్డ్‌ ఫ్లూ!

కరోనా -19 వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి చైనానే కారణమని ఒకవైపు అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా ప్రజలు రకరకాల అడవిజంతువులు, పక్షుల మాంసాన్ని తినడం వల్లే అక్కడినుంచి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయనే అనుమానాలు కూడా బలంగా పాతుకుపోయాయి. తాజాగా చైనాలోని సిచుయన్‌ ప్రావిన్స్‌లో హెచ్‌5 ఎన్6 బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఒకరికి సోకినట్లు  చైనా అధికారిక వార్తాసంస్థ  ఈ రోజు వెల్లడించింది.

Updated : 16 Jul 2021 05:05 IST

 అధికారిక వార్తాసంస్థ వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా -19 వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి చైనానే కారణమని ఒకవైపు అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనీయులు రకరకాల అడవిజంతువులు, పక్షుల మాంసాన్ని తినడం వల్లే అక్కడినుంచి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో హెచ్‌5 ఎన్6 బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఒకరికి సోకినట్లు  చైనా అధికారిక వార్తాసంస్థ  ఈ రోజు వెల్లడించింది. ఈ వైరస్‌ సోకడంతో ఓ వ్యక్తిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమలోని  కోళ్లను వధించినట్లు చైనా సెంట్రల్‌ టెలివిజన్‌(సీసీటీవీ) తెలియజేసింది. అయితే మనుషులకు ఈ వైరస్‌ సోకడం అరుదనీ, ఇది అంటువ్యాధిలా మారి, ప్రబలే అవకాశం  తక్కువని నిపుణులు చెబుతున్నారు.  

బర్డ్‌ ఫ్లూ ఎప్పటి నుంచి..?
 ప్రస్తుతం చైనాలో మనిషికి సోకిన ఎచ్‌5ఎన్‌6 ఇన్‌ఫ్లూయెంజా ఎ బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉపజాతుల్లో ఒకటి. హెచ్5ఎన్1 బర్ఢ్‌ ఫ్లూ వైరస్‌ను 1997లో మొదట కనుగొన్నారు. ఆ ఏడాది  హాంగ్‌కాంగ్‌లో ఈ వైరస్‌ సోకిన18 మందిలో 6మంది మృతి చెందారు. వ్యాధి సోకిన కోళ్లకు మేతవేసేవారు, వాటిని తరలించేవారికి ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు వైరస్‌ సోకిన కోళ్లతోగానీ, ఇతర పక్షులతోగానీ గడిపినా ఇది మనుషులకు సోకుతుంది. 2014 నుంచి ఏప్రిల్‌9, 2021 వరకు 32మందికి సోకినట్లు తెలుస్తోంది.  2016 నవంబరు- డిసెంబరులో చైనాలో మొదటిసారి బర్డ్‌ ఫ్లూ 41 ఏళ్ల  వ్యక్తికి సోకింది.  అదే సంవత్సరం హాంకాంగ్‌, చైనా, దక్షిణ కొరియాలో కోళ్లలో వ్యాప్తి చెందింది.  2017లో ఆస్ట్రేలియాలో హెచ్‌5ఎన్‌6 రకం వైరస్‌ ప్రబలింది. 2020లో చైనాలోని సిచువాన్‌లో, ఫిలిప్పీన్స్‌లోని పౌల్ట్రీలో తిరిగి బయటపడింది.  

భారత్‌లో పరిస్థితి!
2006 నుంచి 2015 వరకు హెచ్‌5 ఎన్‌1 వ్యాప్తికి సంబంధించి 15 రాష్ట్రాల్లో 25 సంఘటనలు నమోదయ్యాయి.  మొదటిసారి మహారాష్ట్ర, గుజరాత్‌లోని పక్షుల్లో ఇది కనిపించింది. కాకులు, బాతుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువ. 2021 జనవరి, మార్చి, ఏప్రిల్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కేరళలోని బాతులు, రాజస్థాన్‌లోని కాకుల్లో ఈ వైరస్‌ కనిపించింది. హరియాణాలో దాదాపు లక్ష కోళ్లు  ప్రాణాలు కోల్పోయాయి.  హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాంగ్‌డామ్‌ కొలనులో 1800 పక్షులు చనిపోయాయి. రాజస్థాన్‌లో 250 కాకులు చనిపోయాయి.  బిహార్‌లో నెమళ్లు మృతి చెందాయి. కశ్మీర్‌లో నాటుకోళ్లకు వ్యాపించింది. 10 రాష్ట్రాల్లోని పౌల్ట్రీల్లో ఇది కనిపించింది. మనదేశంలో హెచ్‌5ఎన్‌8 వైరస్‌ ఎక్కువగా వ్యాపించినట్లు గుర్తించారు.  మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకిన సంఘటన భారత్‌లో ఇంతవరకూ ఒకటి కూడా వెలుగు చూడలేదు.  అయితే, పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో దగ్గరగా గడిపేవారు పీపీఈ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

కట్టడికి మార్గం! 
అడవి పక్షుల ఆవాసాల్లోకి మనుషులు ప్రవేశించకుండా ఉండాలి. కోళ్లు, బాతులకు ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు వెళ్లకూడదు. పక్షులు రెట్టలు వేసినప్పడు, వాటి లాలాజలం ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. సాధారణంగా పక్షుల మాంసాన్ని బాగా ఉండికించి తినడం వల్ల బర్డ్‌ ఫ్లూ వైరస్‌ చనిపోతుంది. ఇది 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ బతకదు.  కానీ పచ్చిమాంసాన్నితాకేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెచ్‌5ఎన్‌1 వైరస్‌ సోకిన పక్షులకోసం అమెరికా 2007లోనే వ్యాక్సిన్‌ తయారు చేసింది. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందకపోవడం ఊరటనిచ్చే అంశం.  ఈ వైరస్‌ సోకితే సాధారణ ఫ్లూ లక్షణాలైన జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటివి కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్‌ బారిన పడ్డవారికి  యాంటీవైరల్‌ డ్రగ్స్‌తో చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని