అది కొవిడ్‌ కంటే భయంకరమైన వైరస్‌.. దానికీ వ్యాక్సిన్‌ కావాలి: చిన్నజీయర్‌ స్వామి

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు అని త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి అన్నారు. ఆయన వెయ్యేళ్ల పండగను

Updated : 01 Feb 2022 03:57 IST

హైదరాబాద్‌: భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు అని త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామి అన్నారు. ఆయన వెయ్యేళ్ల పండగను హైదరాబాద్‌ నగరం జరుపుకోబోతోందని చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతాయని వివరించారు. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్నజీయర్‌ స్వామి మాట్లాడారు. ఎన్నో రకాల అంతర, బాహ్య ప్రయోజనాలు పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. ప్రజలంతా ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు మానవ సమాజంలో వ్యాపించిన వైరస్‌ను కూడా తొలగించేందుకు 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని చిన్నజీయర్‌ వివరించారు. ఈ యజ్ఞానికి 1.5లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నట్లు చెప్పారు.

సమానత కొరవడుతోంది..

‘‘సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వైరస్‌ అసమానత. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నాడు. కుటుంబంలోని వ్యక్తులు పరస్పరం గౌరవానికి నోచుకోవడం లేదు. సమాజంలోని కులాల మధ్య సమానత కొరవడుతోంది. మనుషులు ఆధిపత్యం చెలాయించే వాతావరణాన్ని చూస్తున్నాం. మనిషి లోపలి అహంకారం వల్లే ఈ రుగ్మతలు. ఒకే మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా పరస్పరం కలిసి ఉండే వాతావరణాన్ని చూడలేకపోతున్నాం. ఇది కొవిడ్‌ కంటే ప్రమాదకరమైన వైరస్‌. దీనికీ వ్యాక్సిన్‌ కావాలి. బయట నుంచి వచ్చే జబ్బులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలనుకుంటున్నాం. కానీ అంతకంటే ప్రమాదకరమైనదీ.. భయంకరమైనదీ మనిషికి మనసుల్లో వ్యాపించే వైరస్‌. ఏ సమాజానికైనా ఎన్నో అంతరాలుండే మనుషులుంటారు. ధనం, జ్ఞానం, యోగ్యత, సామాజిక స్థితిగతులు, విశ్వాసాల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఇవన్నీ ఉన్నా ఒకే సమాజంగా మానవుడు బతకాలి. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. దానికి సమానత అనే వ్యాక్సిన్‌ను వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు అందించారు. ఆ సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరం. సమాజంలో ప్రస్తుతం ఉన్న స్థితికి సమతా స్ఫూర్తి ఒక మందు. శాస్త్రీయమైన పద్ధతిలో అద్భుతమైన యాగం చేస్తున్నాం. 108 దివ్యదేశాలు ఏర్పాటు చేశాం. శ్రమ పడాలి, సాధించాలి, సమాజానికి అందించాలి.. ఇదే రామానుజాచార్యుల సిద్ధాంతం. అబద్ధాల సమాజంలో బతకొద్దనేవారు.

సర్వప్రాణి సేవే నినాదంగా ముందుకెళ్లారు..

ప్రకృతి, జంతువుల ఉనికిని మనిషి నాశనం చేస్తున్నాడు. మానవసేవ మాత్రమే మాధవ సేవ కాదని రామానుజాచార్యులు చెప్పారు. నీళ్లను కాపాడు.. భూమిని కలుషితం చేయొద్దు అన్నారు. మన శరీరంలో ఏ భాగాన్నీ తక్కువ చేయనప్పుడు ప్రపంచంలో ప్రతి విషయం ముఖ్యమే. సర్వప్రాణి సేవే నినాదంగా రామానుజాచార్యులు ముందుకు సాగారు. కర్ణాటకలో ఓ సారి కరవు సంభవిస్తే అక్కడ జలాశయాన్ని ఏర్పాటు చేశారు. నేడు నీటి బిందువులు కాపాడుకుందామంటూ ప్రతిజ్ఞలు.. నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిలో ఉన్న గుణం తప్ప కులం కాదని.. జ్ఞానం తప్ప జాతి ముఖ్యం కాదని రామానుజాచార్యులు చెప్పారు. వెయ్యేళ్ల కిందటే దళితులను ఆలయ ప్రవేశం చేయించిన మొట్టమొదటి ఆచార్యుడు ఆయన. ఇటీవల ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం మంచి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇది మానవ జాతి చేసుకున్న అదృష్టం. ఆజాదీకా అమృతోత్సవాల్లో మహనీయుల గొప్పతనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ వచ్చిందని భావిస్తున్నాం.

రామానుజాచార్యుల సిద్ధాంతాలు ఇప్పుడు అత్యవసరం

ప్రపంచానికి సమానత్వాన్ని ప్రబోధించడానికే సమతామూర్తి కేంద్రం నిర్మించాం. సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తుల చరిత్ర సమతా స్ఫూర్తి కేంద్రంలో ఉంటుంది. అందరం సమానమే.. కులం అనే హద్దులు దాటుదాం అనే భావనను చాటుకుందామన్నది రామానుజాచార్యుల సిద్ధాంతం. ఆయన సిద్ధాంతాలు ఇప్పుడు అత్యవసరం. అందుకే 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. సమతామూర్తి కేంద్రంలో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 108 దివ్య దేశాలను దర్శించుకునే వాళ్లు రామానుజాచార్యుల అంత ఎత్తుకు ఎదగాలనేదే మా భావన’’ అని చిన్న జీయర్‌ స్వామి అన్నారు.

సమతా స్ఫూర్తి కేంద్రం నిర్మాణ విశేషాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని