Updated : 19 Mar 2022 05:09 IST

chinna jeeyar swamy: వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు: చినజీయర్‌ స్వామి

విజయవాడ: ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని, వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి అన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరు దేవతలను కించ పరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు.

‘‘ఇవాళ లక్ష్మీదేవి పుట్టినరోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం అని చెప్పాలి. మహిళ.. శక్తికి కేంద్రం. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళా శాసనాలు. మన సంస్కృతిలో మొదట చెప్పేది.. మాతృదేవోభవ అనే. వారికి మన ఆదరణ, గౌరవం లభించాలి. ఆరాధ్య స్థానాన్ని కూడా కల్పించాలి. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజాచార్యులు చెప్పారు. జ్ఞానం చూసి దళితులకూ ఆరాధ్య స్థానం కల్పించారు. లోకానికి ఉపకరించే జ్ఞానం, భక్తి ఉన్నవారందరూ ఆరాధనీయులే. రామానుజ స్వామి పరంపరంగా వచ్చిన వాళ్లం మేం. జ్ఞానంలో ఉన్నతులైన హరిజనులు, గిరిజనులకు ఆరాధన స్థానం కల్పించాం. మనిషికి జన్మ కారణం కాదు.. ఆరాధనకు జ్ఞానమే కారణమని మహనీయులు నిరూపించారు.’’

‘‘తిరుప్పాణ్‌ అనే హరిజనుడు.. జ్ఞానానికి భగవత్‌ మార్గాన్ని తెరవగల మహనీయుడు. మనిషి బ్రాహ్మణుడా? హరిజనుడా? గిరిజనుడా? అన్నది పక్కన పెట్టి, ఆరాధనకు తగిన వ్యక్తులు అవుతారని ఎంతోమంది నిరూపించారు. రామానుజల కాలంలోనే ఆయన బోధనల వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారు. అందులో ఆదివాసీ జనం కూడా ఉన్నారు. వాళ్లందరినీ సంప్రదాయం పాటించే వారిగా తీర్చిదిద్దారు. ఆదివాసీలు, హరిజనులు అన్న తేడా లేకుండా అడుగు వర్గాలు, బడుగు వర్గాలు సామాజిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆశించిన ఆచార్యుడు రామానుజాచార్యులు. దాన్ని మళ్లీ పునరుద్ధరించిన మహనీయుడు మా గురువు పెద్ద జీయర్‌స్వామి. ఆయన అడుగు జాడల్లోనే మేమంతా వచ్చాం. ఒకప్పుడు సమాజంలో మహిళలకు మంత్రం అందకూడదని చెప్పేవారు. రామానుజ పరంపరలో మహిళలు కూడా మంత్ర పఠనానికి అర్హులే అని వాళ్లకు రామానుజులు సమానతను కల్పించారు. మహిళలు మంచి మార్గంలో సాగాలని మంగళా శాసనాలు చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని మహిళలు సమాజ ప్రగతి భాగస్వాములు కావాలని కోరుతున్నాం.’’

‘‘ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి, అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది’’

‘‘చెట్టు, గుట్ట అన్నీ పూజనీయమైనవే. మన సంప్రదాయం చాలా గొప్పది. ప్రకృతిని.. ప్రాణకోటిని గౌరవించడం మన బాధ్యత. 20 ఏళ్లకు పూర్వం మాట్లాడిన దాన్ని కట్ చేసి వేశారు. మనుషుల్లో ఉండే వ్యక్తులకు దైవత్వాన్ని కలగచేశారనే భావంతో మాట్లాడాం. గ్రామ దేవతల్లో చాలా మంది మహిళలు చక్కటి జ్ఞానం కలిగిన వారు. గ్రామ దేవతలు స్వర్గం నుంచి వచ్చి దేవతలు కాలేదు. మనుషులుగానే ఉంటూ ఆరాధ్యనీయులైన మహిళలు. అలాంటి గ్రామ దేవతలను మన మధ్య పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలు చేయడం సరికాదని నేను చెప్పా. ఇప్పుడు మాట్లాడే వారు.. ఈ విషయాలనీ గమనిస్తున్నారు. మాకూ అందరూ సమానమే. మా పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండదు. రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక ఉండదు.. రాదు. సంప్రదాయ దీక్ష తీసుకోవాలని భావించే వాళ్లు మాంసాహారం తీసుకోవద్దని సూచించాం. సామాన్యుల గురించి మేం మాట్లాడలేదు. మాకు ఎవ్వరితోనూ గ్యాప్ లేదు. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదు. మేం సమాజానికి కళ్లలాంటి వాళ్లం. మేం సమాజంలో జరుగుతున్న తప్పులను చెబుతూ హెచ్చరించడం మా బాధ్యత. ఎవరైనా సలహా అడిగితే చెబుదాం. బాధ్యత తీసుకుంటే.. దాన్ని 100 శాతం నెరవేరుస్తాం. మాకు ఇది కావాలని ఎవ్వర్ని అడగం’’

‘‘ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించాం. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించం. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉంది. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి. విషయం తెలుసుకోవాలి. తర్వాత సరైన విధానంలో స్పందించాలి. పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో మేం ఉంటాం. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరం. ఆ సమాజమే క్రమంగా వికాసం వైపు సాగుతుంది’’అని చినజీయర్‌ స్వామి అన్నారు.

హిందూ మతానికి చెందిన వాళ్లే ఈ తరహా ప్రచారం చేయడం మరింత బాధ కలిగిస్తోందని మరో ఆధ్యాత్మిక వేత్త అహోబిల రామానుజ స్వామీజీ అన్నారు. కొంత మంది ఈర్ష్య, అసూయలతో ఉన్నారని, హిందూ ధర్మంలో సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ వంటి పెద్ద కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రకమైన వివాదం రావడం బాధాకరమన్నారు. ఓ సినీ ప్రముఖుడు.. స్వామి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. స్వామి వారు ఎప్పుడో చెప్పిన వ్యాఖ్యానాలను ముందూ వెనుకా కత్తిరించి ఇప్పుడు ప్రచారంలో పెట్టారని అహోబిల రామానుజ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని