Chiranjeevi: ‘అలయ్‌ బలయ్‌’ దేశవ్యాప్తంగా జరగాలి: చిరంజీవి

తెలంగాణ సంస్కృతితో భాగంగా ‘అలయ్‌ బలయ్‌’ ఉందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు.

Updated : 06 Oct 2022 14:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతిలో ‘అలయ్‌ బలయ్‌’ భాగంగా ఉందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు. గతంలో పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌కు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 

‘అలయ్‌ బలయ్‌’కు విస్తృత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి దత్తాత్రేయ అని చిరంజీవి అన్నారు. ఇది ఉన్నతమైన కార్యక్రమమని చెప్పారు. సాధారణంగా విద్య, వైద్యం, వైజ్ఞానిక కార్యక్రమాలు ఉంటాయని.. కానీ ప్రేమ, సౌభ్రాతృత్వం పంచే అద్భుతం అలయ్‌ బలయ్‌ అని ఆయన కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. మనం చెప్పలేని భాషను గుండె చప్పుడు చెబుతుందని.. మానవత్వ విలువలు మరిచిపోకూడదన్నారు. మాటకు లొంగని వ్యక్తి హృదయ స్పందనకు లొంగుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా బుధవారం విడుదలైన తన సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ విజయం పట్ల చిరంజీవి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని