Coal India: ఉద్యోగి కుమార్తెకు అరుదైన వ్యాధి.. కోల్‌ఇండియా రూ.16కోట్ల సాయం

ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌(Coal India Ltd) దాతృత్వాన్ని చాటుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఉద్యోగి రెండేళ్ల కుమార్తె చికిత్స కోసం

Published : 19 Nov 2021 01:44 IST

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌(Coal India Ltd) దాతృత్వాన్ని చాటుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఉద్యోగి రెండేళ్ల కుమార్తె చికిత్స కోసం రూ.16కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. మానవతా దృక్పథంతో ఆ పాప చికిత్సకు సాయం చేయాలని నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 

ఛత్తీస్‌గఢ్‌లో కోల్‌ఇండియా విభాగమైన సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(SECL)కు చెందిన దీప్కా కోల్‌ ఏరియాలో సతీశ్ కుమార్‌ రవి అనే వ్యక్తి ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె సృష్టి రాణి 2019లో జన్మించింది. పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి ఆ పాప తరచూ అనారోగ్యానికి గురైంది. అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా సతీశ్ దంపతులు బయటకు వెళ్లలేక స్థానిక వైద్యుల వద్ద ట్రీట్మెంట్‌ ఇప్పించారు. అయినప్పటికీ పాప కోలుకోకపోవడంతో గతేడాది డిసెంబరులో తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపకు చికిత్స అందించిన వైద్యులు.. స్పైనల్‌ మస్కులర్‌ ఆత్రోఫీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఈ వ్యాధి సోకిన వారికి వెన్నెముక‌, బ్రెయిన్‌ స్టెమ్‌ నరాల్లో కణజాలాలు ఉండవు. దీంతో కండరాలపై నియంత్రణ ఉండదు. వెల్లూరులో చికిత్స తీసుకుని తిరిగి వస్తుండగా.. సృష్టి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో బిలాస్‌పూర్‌లో అపోలో ఆసుపత్రిలో ఉంచారు. అక్కడి నుంచి దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినప్పటికీ పాపకు నయం కాలేదు. ప్రస్తుతం పాప పోర్టబుల్‌ వెంటిలేటర్‌పై ఉంది. ఆమెను కాపాడాలంటే జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ కావాలి. దీని ధర రూ.16కోట్లు. అది కూడా భారత్‌లో దొరకదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి.

ఈ విషయం తెలుసుకున్న కోల్‌ ఇండియా యాజమాన్యం.. సృష్టికి వైద్యం అందించేందుకు ముందుకొచ్చింది. ‘‘సతీశ్ లాంటి ఉద్యోగి అంత ధర ఉన్న ఇంజెక్షన్‌ కొనుగోలు చేయడం అసాధ్యం. అందుకే ఆ ఇంజెక్షన్‌ ఖర్చును తామే భరించాలని కోల్‌ఇండియా యాజమాన్యం నిర్ణయించింది. ఏ సంస్థకైనా ఉద్యోగితో పాటు అతడి కుటుంబం కూడా విలువైనదే. వారి ప్రాణాలను కాపాడుకోవడం మా తొలి ప్రాధాన్యత. ఈ నిర్ణయంతో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు మేం ఆదర్శంగా నిలుస్తాం’’ అని కోల్‌ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని