AP Voter List: ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించండి: సీఎఫ్‌డీ

ఏపీ ఓటరు జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.

Updated : 03 Oct 2023 18:56 IST

అమరావతి: ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (సీఈవో) సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సీఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధ్యాపకులకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియను గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది చేపట్టారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందికి అనుభవలేమి, బూత్‌ లెవెల్‌ అధికారుల అనుభవ రాహిత్యంతో జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని స్పష్టం చేశారు. వారి తప్పిదాలతో ఓటర్లు ‘రైట్‌ టు ఓట్‌’ అంశాన్ని కోల్పోతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలు, భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎఫ్‌డీ పేర్కొంది. ఒకే డోర్‌ నెంబర్‌పై వందలాది ఓట్ల నమోదు జరిగినట్లు తెలిసిందని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ఇటీవల కాగ్ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినట్లు సీఈవో దృష్టికి తీసుకెళ్లింది. ఓటర్ల జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జోక్యాన్ని తప్పించాలని కోరింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశమే లేదని సీఎఫ్‌డీ పేర్కొంది. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై రాజకీయ నేపథ్య ఆరోపణలు ఉన్నాయని, ఈ క్రమంలో వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలని కోరింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉపాధ్యాయులకు అపార అనుభవం ఉందన్న సీఎఫ్‌డీ.. అనుభవం గల టీచర్లకు ఎన్నికల ప్రక్రియను అప్పగించాలని కోరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని