ఏజీ తీరు దురదృష్టకరం: జస్టిస్‌ రామచంద్రరావు 

కృష్ణానది జల విద్యుత్‌ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) ధర్మాసనమే

Updated : 06 Jul 2021 12:33 IST

హైదరాబాద్‌: కృష్ణానది జల విద్యుత్‌ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) ధర్మాసనమే విచారణ చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రసాద్‌ కోరారు. నదీ జలాల అంశం రోస్టర్‌ ప్రకారం సీజే ధర్మాసనానికి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని సీజే వద్ద ప్రస్తావించినట్లు వివరించారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న జస్టిస్‌ రామచంద్రారావు ధర్మాసనానికి ఈ సమాచారం ఇవ్వాలని సీజే తెలిపినట్లు ఏజీ చెప్పారు.

ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమూర్తి ఏపీ వ్యక్తి కాబట్టి బెంచ్‌ మార్చాలని ఏజీ కోరారని పిటిషనర్లు తెలిపారు. పిటిషన్‌పై విచారణ చేపట్టాక మళ్లీ అభ్యంతరాలేంటని జస్టిస్‌ రామచంద్రరావు బెంచ్‌ ప్రశ్నించింది. ఏజీ తీరు దురదృష్టకరం అని జస్టిస్‌ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సీజే నుంచి స్పష్టత తీసుకొని నిర్ణయం చెబుతామని ధర్మాసనం తెలిపింది.

జల వివాదం పిటిషన్లకు సంబంధించి ఇరు వైపుల న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదని చెప్పారు. న్యాయమూర్తిపై అభ్యంతరాలుంటే పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో మధ్యంతర పిటిషన్ వెనక్కి తీసుకుంటానని ఏజీ తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణపైనా సీజే అసహనం వ్యక్తం చేశారు. ఫలానా బెంచ్‌ కావాలని కోరడం పద్ధతి కాదని తెలిపారు. ఏ బెంచ్‌ విచారణ చేపట్టాలో తానే నిర్ణయిస్తానని సీజే వివరించారు. 

కృష్ణా బేసిన్‌లో పూర్తి స్థాయి జలవిద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 28న జారీ చేసిన జీవో 34ను సవాలు చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణప్రసాద్‌, ఎం.వెంకటప్పయ్యలు తెలంగాణ హైకోర్టులో నిన్న లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని