Chitrakoot: నిందితులను వెంటాడిన పీడకలలు.. చోరీ చేసిన విగ్రహాల అప్పగింత!

ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ వాటిని తిరిగి ఆలయ పూజారి ఇంటి సమీపంలో వదిలేయడం గమనార్హం. పోలీసుల...

Published : 17 May 2022 01:56 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ వాటిని తిరిగి ఆలయ పూజారి ఇంటి సమీపంలో వదిలేయడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్రకూట్‌ జిల్లా తరౌన్హాలోని ఓ పురాతన బాలాజీ ఆలయం నుంచి మే 9న రాత్రి రూ.కోట్ల విలువైన 16 అష్టధాతు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి ఆలయ పూజారి మహంత్ రామ్‌బాలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సదర్ కొత్వాలి కార్వీ స్టేషన్ అధికారి రాజీవ్కుమార్ సింగ్ తెలిపారు.

ఈ క్రమంలోనే చోరీకి గురైన 16 విగ్రహాల్లో 14 ఆదివారం మహంత్ నివాసానికి సమీపంలో ఒక గోనె సంచిలో లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఓ లేఖ కూడా బయటపడినట్లు అధికారి తెలిపారు. ‘చోరీ ఘటన అనంతరం రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. అందుకే భయంతో ఈ విగ్రహాలను తిరిగి ఇస్తున్న’ట్లు అందులో రాసి ఉందని చెప్పారు. ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకుని, భద్రపరిచామని.. నిందితులను పట్టుకునే దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని