Chandrababu: ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలపై కసరత్తు.. సీఎస్‌, డీజీపీలతో చంద్రబాబు భేటీ

రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టినట్టు సమాచారం. 

Updated : 15 Jun 2024 16:51 IST

అమరావతి: పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. శనివారం తన నివాసంలో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంవో ఇప్పటికే సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు సమాచారం.

వైకాపాతో అంటకాగిన వారిని ప్రభుత్వం దూరంగా పెట్టనున్నట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాశ్‌, శశి భూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలిస్తారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాథ్‌ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్.సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. తితిదే ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు.. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని