Chandrababu: గత ఐదేళ్లలో ఏం చేశారో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆత్మవిమర్శ చేసుకోవాలి: చంద్రబాబు

గడచిన ఐదేళ్లలో అఖిలభారత సర్వీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Published : 13 Jun 2024 22:30 IST

అమరావతి: గడిచిన ఐదేళ్లలో అఖిలభారత సర్వీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కొద్దిసేపు సమావేశమైన చంద్రబాబు.. వారితో ఒకింత కటువుగానే మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 1995లో మొదటిసారి సీఎం అయిన తరుణం నుంచి కొందరు పనిచేసి ఉంటారని.. ఇప్పుడు నాలుగో దఫా సీఎంగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. 

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలని.. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారని అన్నారు. ఏపీలోని కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారని, కానీ గత ఐదేళ్లలో అధికారులు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. వివిధ ప్రభుత్వశాఖలు నిస్తేజంగా తయారయ్యాయని, వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వంపై ఎప్పుడూ చూడనంత అసహనం, కసి ప్రజల్లో రావడానికి గడిచిన ఐదేళ్లలో జరిగిన దారుణాలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం లేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తన బాధ అని వెల్లడించారు. పరిపాలన గాడిలోపెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని, త్వరలోనే పాలనను చక్కదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని