Teachers Day: దేశ నిర్మాణంలో గురువులదే కీలక పాత్ర.. ఏపీ గవర్నర్‌, సీఎం శుభాకాంక్షలు

భావి భారత పౌరుల నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ....

Updated : 09 Dec 2021 16:46 IST

అమరావతి: భావి భారత పౌరుల నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ అన్నారు. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు చెప్పారు. దేశ రాష్ట్రపతిగా సేవలందించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని గవర్నర్‌ అన్నారు. రాధాకృష్ణన్ ఆదర్శప్రాయమైన విద్యావేత్త, పండితుడు, తత్వవేత్త, రచయిత అని.. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.

ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గవర్నర్‌ అన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అత్యంత గొప్పదన్నారు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఉపాధ్యాయుడి సహకారం  గుర్తించదగినదన్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యా బోధనలో అంతరాయం నెలకొందని ఆవేదన వ్యక్తంచేసిన గవర్నర్‌.. ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేందుకు కృషిచేస్తున్నారని అభినందించారు. మరోవైపు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కుగా విద్య అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ఇందుకోసం తాము చేపట్టిన విద్యా సంస్కరణలతో గురువుల బాధ్యత మరింత పెరిగిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని